FIFA World Cup 2022: 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్ జట్లకు భారీ షాక్‌లు తగిలాయి. ఇప్పటికే అర్జెంటీనాపై సౌదీ అరేబియా సంచలన విజయం సాధించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. తాజాగా ఫుట్‌బాల్‌లో ప్రపంచ నంబర్‌ 2 జట్టు అయిన బెల్జియం జట్టుకు ఫిఫా ప్రపంచకప్‌లో గట్టి షాక్‌ తగిలింది. మొరాకో చేతిలో 0-2తో బెల్జియం ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో బెల్జియం‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. 

భారీ అల్లర్లు

ఈ ఓటమి.. బెల్జియంలో అల్లర్లకు దారితీసింది. జట్టుపై ఆగ్రహానికి గురైన అభిమానులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో బెల్జియం‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం మ్యాచ్‌ పూర్తవ్వగానే బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో వందలాది మంది సాకర్‌ అభిమానులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు.

కార్లు, ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురు నిరసనకారులను అరెస్టు చేశారు. అల్లర్ల కారణంగా పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

వేడుకలు

బెల్జియంపై అనూహ్య విజయం సాధించడంతో మొరాకోలో సంబరాలు అంబరాన్నంటాయి. బెల్జియం, డచ్‌లోని పలు నగరాల్లో మొరాకో వలసదారులు ఆశ్రయం పొందుతున్నారు. దీంతో వలసదారులు వేడుకలు చేసుకుంటుండగా.. బెల్జియం అభిమానులు కొందరు ఈ అల్లర్లకు పాల్పడ్డారు.

అద్భుత గెలుపు

బెల్జియం జట్టు ప్రపంచకప్‌ ఆశలను మొరాకో గట్టిగా దెబ్బతీసింది. తన తొలి మ్యాచ్‌లో నెగ్గిన బెల్జియం.. ఈ రెండో మ్యాచ్‌లో గెలిస్తే నాకౌట్లో అడుగుపెట్టేదే. కానీ ఆదివారం మొరాకో అందరినీ ఆశ్చర్యపరుస్తూ 2-0తో బెల్జియంను ఓడించింది. తొలి మ్యాచ్‌లో క్రొయేషియాతో డ్రా చేసుకున్న మొరాకో గ్రూప్‌-ఎఫ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచకప్‌ చరిత్రలో అ జట్టుకిది మూడో విజయం మాత్రమే.

1998 ప్రపంచకప్‌ తర్వాత మొదటిది. మొరాకో తన చివరి మ్యాచ్‌లో గురువారం కెనడాతో కనీసం డ్రా చేసుకున్నా.. నాకౌట్‌కు చేరే అవకాశం ఉంది. ఇక బెల్జియం ముందంజ వేయాలంటే తన చివరి మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌ రన్నరప్‌ క్రొయేషియాపై తప్పక నెగ్గాల్సిందే.

Also Read: FIFA World Cup 2022: కోస్టారికా రౌండ్ ఆఫ్ 16 ఆశలు సజీవం - జపాన్‌పై 1-0తో విజయం