FIFA WC 2022 Final: ఫిఫా ప్రపంచకప్ లో ఆఖరి అంకానికి ఇంకా కొన్ని గంటలే సమయముంది. ఫైనల్ లో సమఉజ్జీల పోరు చూసేందుకు ఫుట్ బాల్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దాదాపు నెలరోజుల పాటు ఫుట్ బాల్ ప్రేమికులను అలరించిన ఈ టోర్నీలో నేడే ఆఖరి మ్యాచ్. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్, మాజీ ఛాంపియన్ అర్జెంటీనా కప్పు కోసం తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా అది దానికి మూడో ట్రోఫీ అవుతుంది. అర్జెంటీనా 1978, 1986 లో ప్రపంచకప్ గెలుచుకుంది. ఫ్రాన్స్ 1998, 2018లో టైటిల్ సాధించింది. 


అర్జెంటీనా... మెస్సీ కోసం


లియోనల్ మెస్సీ.. ఫుట్ బాల్ ఆటలో ప్రపంచంలోనే మేటి అనదగ్గ ఆటగాళ్లలో ఒకడు. అంతర్జాతీయంగానూ, క్లబ్ పోటీలలోనూ ఎన్నో ట్రోఫీలు అందుకున్నాడు. రికార్డులు, అవార్డులు సాధించాడు. అయినప్పటికీ ప్రపంచకప్ మాత్రం అతనికి ఇంకా కలగానే ఉంది. 2014 లో అర్జెంటీనా ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ గానే మిగిలింది. అందుకే ఈసారైనా కప్పు కల నెరవేర్చుకుని ఘనంగా నిష్క్రమించాలని మెస్సీ భావిస్తున్నాడు. ఈ ఫైనలే తాను ఆడే చివరి ప్రపంచకప్ మ్యాచ్ అని ముందే ప్రకటించాడు. ఈ క్రమంలో అర్జెంటీనా జట్టు మొత్తం మెస్సీకి కప్ అందించాలనే పట్టుదలతో ఉంది. ఈ టోర్నీ తొలి మ్యాచులో సౌదీ అరేబియా చేతిలో కంగుతిన్నప్పటికీ.. సూపర్ ఆటతో మెస్సీ తన జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 5 గోల్స్ చేశాడు. మెస్సీతో పాటు అల్వారెజ్, మార్టనెజ్ లాంటి కీలక ఆటగాళ్లు రాణిస్తే కప్పు కల నెరవేరినట్లే.






ఫ్రాన్స్... మరోసారి 


ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అంచనాలకు తగ్గట్లే ఆడింది. గ్రూపు దశలో నాకౌట్ బెర్తు ఖరారయ్యాక ట్యునీషియా చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. అదొక్కటి తప్పిస్తే టోర్నీలో మిగతా మ్యాచ్ లన్నీ బాగానే ఆడింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎంబాపై అద్భుత ఫాంలో ఉన్నాడు. మెస్సీ లానే అతను కూడా ఈ టోర్నీలో 5 గోల్స్ చేశాడు. ఎంబాపెతో పాటు గ్రీజ్‌మన్‌, గిరూడ్ లు రాణిస్తే ట్రోఫీ గెలవడం తేలికే. అయితే ఆ జట్టును అనారోగ్యం వెంటాడుతోంది. ఫ్రాన్స్ శిబిరంలో ఫ్లూ విస్తరిస్తుండడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే డయోట్‌, రాబియట్‌ మొరాకోతో సెమీస్‌కు దూరమయ్యారు. అయినా జట్టు సులువుగానే గెలిచింది. కానీ అర్జెంటీనాతో ఫైనల్‌ ముంగిట వరానె లాంటి కీలక ఆటగాడితో పాటు కొనాటె కూడా ఫ్లూ బారిన పడ్డాడు. వాళ్లిద్దరూ జలుబు, కాస్త జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వరానె ఫైనల్‌కు అందుబాటులో లేకుండా ఫ్రాన్స్‌కు ఎదురుదెబ్బే.


ఆట పరంగా, బలాబలాల పరంగా, ఫామ్ పరంగా ఎలా చూసుకున్నా అర్జెంటీనా, ఫ్రాన్స్ లు సమఉజ్జీలు. ఈ రెండు జట్లలో కప్ ఏది గెలుస్తుందనేది అంచనాలకు అందని విషయం. అయితే చిన్న జట్ల సంచలనాలు.. పెద్ద జట్ల పతనం.. స్టార్‌ ఆటగాళ్ల మెరుపులతో అనిర్వచనీయ అనుభూతులతో ఆకట్టుకున్న ఈ టోర్నీలో... ఫైనల్ సమరం కూడా అద్భుతంగా సాగుతుందనడంలో సందేహంలేదు. 


భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. స్పోర్ట్స్ 18 ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో సినిమాస్, వూట్ యాప్ లలో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.