FIFA WC 2022 Qatar: ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లు ఆసక్తిగాా మారుతున్నాయి. గ్రూప్‌-హెచ్‌లో రెండు విజయాలతో పోర్చుగల్‌ ముందే  రౌండ్ ఆఫ్ 16 బెర్తును ఖాయం చేసుకుంది. మరో బెర్తు కోసం ఉరుగ్వే, దక్షిణ కొరియా, ఘనా పోటీలో నిలిచాయి. అయితే బలమైన పోర్చుగల్ ను ఓడించిన కొరియా నాకౌట్ చేరుకుంది. మరోవైపు ఘనాపై ఘన విజయం సాధించినా ఉరుగ్వే ముందంజ వేయలేకపోయింది. 


కొరియా నిలిచింది


గ్రూప్ హెచ్ మ్యాచులో బలమైన పోర్చుగల్‌కు షాకిచ్చింది కొరియా. ఫిఫా ప్రపంచకప్‌ కొరియా జట్టు ప్రిక్వార్టర్స్‌ లోకి దూసుకెళ్లింది. నాకౌట్‌ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆ జట్టు 2-1తేడాతో పోర్చుగల్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో బంతిపై నియంత్రణలో పోర్చుగల్‌ (62 శాతం)దే పైచేయి కానీ.. కీలక సమయాల్లో స్కోరు చేసిన కొరియాను విజయం వరించింది. అయిదో నిమిషంలో రికార్డో కొట్టిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన పోర్చుగల్‌ ఆ తర్వాత కూడా పదే పదే కొరియా డిఫెన్స్‌ను పరీక్షించింది. కానీ కొరియా అదను చూసి దెబ్బ కొట్టింది. ఒకవైపు రక్షణ శ్రేణిని పటిష్టం చేసుకుని మరోవైపు దాడులు చేసిన కొరియా 27వ నిమిషంలో ఫలితం సాధించింది. కార్నర్‌ నుంచి బంతిని దొరకబుచ్చుకున్న యంగ్‌వాన్‌ మెరుపు వేగంతో నెట్‌లోకి పంపేశాడు.






పోర్చుగల్ ప్రయత్నాలు విఫలం


ఆ తర్వాత పోర్చుగల్‌ గోల్‌ కోసం గట్టి ప్రయత్నాలే చేసింది. కొరియా కీపర్‌ అడ్డుగోడగా నిలవడంతో ఆ జట్టు ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసి ఆట ఇంజురీ టైమ్‌కు వెళ్లడంతో మ్యాచ్‌ డ్రా దిశగా సాగుతున్నట్లే కనిపించింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఒత్తిడి పెరిగిపోతుండగా కొరియా అద్భుతమే చేసింది. హి చాన్‌ (91వ ని) ఓ సూపర్‌ గోల్‌ చేసి కొరియా నాకౌట్‌ ఆశలకు ప్రాణం పోశాడు. పోర్చుగల్‌ గోల్‌ బాక్స్‌ సమీపంలో పాస్‌ అందుకున్న చాన్‌ పొరపాటుకు తావివ్వకుండా గోల్‌ కొట్టేశాడు. 2-1 ఆధిక్యాన్ని ఆఖరిదాకా కాపాడుకున్న కొరియా విజయం సాధించింది.