FIFA WC 2022 Qatar:  ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ 2022లో సంచలనాలు కొనసాగుతున్నాయి. మొన్న అర్జెంటీనాను పసికూన సౌదీ అరేబియా ఓడిస్తే.. నేడు జర్మనీపై జపాన్ అద్భుత విజయం సాధించింది. 2-1 తేడాతో పటిష్టమైన జర్మనీని జపాన్ కంగుతినిపించింది. 


మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే జర్మనీ గోల్ కొట్టి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ జట్టు ఆటగాడు గుండోగన్ 33వ నిమిషంలో గోల్ చేశాడు. అయితే ఆ తర్వాత జపాన్ ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్ చేయడమే కాక జర్మనీకి ఇంకో గోల్ కొట్టే అవకాశం ఇవ్వలేదు. జపాన్ తరఫున రిస్తో డోన్ 75వ నిమిషంలో... టకుమా అసానో 83వ నిమిషంలో గోల్స్ చేశారు. దీంతో జర్మనీపై 2-1 తేడాతో జపాన్ విజయం సాధించింది. 


ఈ మ్యాచ్ విశేషాలు


● మొదటి అర్ధభాగంలో ఆధిక్యంలో ఉండి జర్మనీ మ్యాచ్ ఓడిపోవడం 1978 తర్వాత ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ ముందు వరకు వారు 21 మ్యాచులలో ఓటమి లేకుండా అజేయంగా ఉన్నారు. 


● గేమ్ లో వెనుకబడి గెలవడం జపాన్ కు ఇది మొదటిసారి. ఈ మ్యాచు ముందు వరకు వారు ఆడిన 13 మ్యాచుల్లో రెండు డ్రా కాగా.. 11 మ్యాచుల్లో ఓడిపోయింది. 


● జర్మనీ జట్టు మొదటి 18 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో (W13 D4) కేవలం ఒకదానిలో మాత్రమే తమ తొలి గేమ్ ఓడిపోయింది. గత 2 ప్రపంచకప్‌లలో ప్రతి దానిలోనూ మొదటి మ్యాచును కోల్పోయింది.


●  ఒకే ప్రపంచకప్ లో ఇద్దరు సబ్ స్టిట్యూట్ లు (రిట్స్ డోన్, టకుమా అసనో) గోల్స్ చేసిన జట్టుగా జపాన్ నిలిచింది. 



ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఘనవిజయం


మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, ఆస్ట్రేలియాపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ ఆటగాళ్ల దూకుడు ముందు ఆస్ట్రేలియా ప్లేయర్స్ నిలువలేకపోయారు. ఫ్రాన్స్‌ ఆటగాళ్లు ఆడ్రిన్‌ రాబియోట్ (27వ నిమిషంలో), ఓలివిర్‌ గిరౌడ్ (32 నిమిషం, 71వ నిమిషం), క్లియాన్‌ మప్పే (68 నిమిషంలో) గోల్స్‌ కొట్టారు. తొలుత ఆస్ట్రేలియా దూకుడుగానే ప్రారంభించినా ఫ్రాన్స్‌ ఎదుట నిలవలేకపోయింది. ఆట ప్రారంభమైన 9వ నిమిషంలోనే ఆసీస్ ప్లేయర్ క్రెయిగ్ గుడ్‌విన్ గోల్‌ సాధించాడు. ఆ తర్వాత పుంజుకొన్న ఫ్రాన్స్‌ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గోల్స్‌ కొట్టేసి విజయం సాధించింది.