FIFA WC 2022: ఫిఫా ప్రపంచకప్ ను గెలుచుకున్న అర్జెంటీనా జట్టు అభిమానులతో కలిసి సంబరాలు చేసుకోనుంది. మంగళవారం చరిత్రాత్మక క్రీడా వేడుకలకు కేంద్ర బిందువైన స్మారక చిహ్నం ఒబెలిస్క్ లోని బ్యూనస్ ఎయిర్స్ లో తమ జట్టు ప్రపంచకప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోనుందని అర్జెంటీనా ఫుట్ బాల్ సమాఖ్య ప్రకటించింది.
'అవును. మేం ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్లం. అభిమానులతో కలిసి టైటిల్ విజయాన్ని మేం సంబరంగా జరుపుకోబోతున్నాం. ఇందుకోసం జట్టు ఒబెలిస్క్ కు బయలుదేరింది.' అని అర్జెంటీనా ఫుట్ బాల్ అసోసియేషన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. అలాగే తమ దేశంలో బ్యాంకులకు మంగళవారం అర్జెంటీనా సెలవు ప్రకటించింది. తద్వారా దేశం మొత్తం ఈ సంబరాల్లో భాగం కానుంది.
'నేను అర్జెంటీనాకు వెళ్లడానికి ఎంతో ఆతృతతో ఉన్నాను. నా దేశ ప్రజలు నాకోసం వేచి ఉండాలని నేను కోరుకుంటున్నాను. వారితో కలిసి ప్రపంచకప్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేనిక వేచి ఉండలేను.' అని కెప్టెన్ లియోనెల్ మెస్సీ అన్నాడు.
ఫైనల్ ఉత్కంఠభరితం- విజయం అర్జెంటీనా సొంతం
ఆదివారం రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ లో 4-2 తేడాతో ఫ్రాన్స్ ను ఓడించింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ... ఈ ప్రపంచకప్ టోర్నీలో తన అత్యుత్తమ ఆటను బయటకు తీశాడు. వయసు పెరిగినా.. ఆట తగ్గలేదంటూ తన అర్జెంటీనా జట్టును ముందుండి నడిపించాడు. గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు తన జట్టును తీసుకొచ్చాడు. ఇదే ఆఖరి ప్రపంచకప్ మ్యాచ్ అని ముందే ప్రకటించిన మెస్సీ.. తన కెరీర్ లో ఒక్క ప్రపంచకప్ అయినా అందుకోవాలనే కసితో ఫైనల్లో ప్రాణం పెట్టి ఆడాడు. మ్యాచ్ సమయంలో ఒకటి, అదనపు సమయంలో మరొకటి, ఆఖర్లో పెనాల్టీ షూటౌట్లో మరొకటి ఇలా మొత్తం 3 గోల్స్ కొట్టి జట్టు కప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అనంతరం ట్రోఫీని అందుకుని మురిసిపోయాడు. ఈ మ్యాచుతో మెస్సీ 2 కీలక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.