FIFA WC 2022 Fever: ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ మొదలైపోయింది. నిన్న ఆతిథ్య ఖతార్- ఈక్వెడార్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ ప్రపంచకప్ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. భారత్ లోనూ ఫిఫాకు చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం కేరళలోని ఫుట్ బాల్ ఫ్యాన్స్ చేసిన పని ఈ ఆటకు ఎంత క్రేజ్ ఉందో తెలియజేస్తోంది. ఇంతకీ వారేం చేశారో తెలుసా.
భారత్ లోని కేరళలోని ఫుట్ బాల్ అభిమానులు ఫిఫా ప్రపంచకప్ చూడడం కోసం ఏకంగా ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 17 మంది కలిసి రూ. 23 లక్షలతో ఒక ఇంటిని కొన్నారు. ఇందులో వారందరూ కలిసి మ్యాచులు చూస్తారట. కొనుగోలు చేసిన వారిలో ఒకతను మాట్లాడుతూ... ఫిఫా వరల్డ్ కప్ 2022 కోసం మేం భిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాం. 17 మందిమి కలిసి రూ. 23 లక్షలతో ఇళ్లు కొన్నాం. దాన్ని జెండాలతో అలంకరించాం. ఇప్పుడు అందరం కలిసి ఆ ఇంట్లో పెద్ద స్క్రీన్ పై మ్యాచులు చూస్తూ ఎంజాయ్ చేస్తాం అని చెప్పారు.
ఫిఫా ప్రపంచకప్ ముఖచిత్రం
ఫిఫా ప్రపంచకప్ 29 రోజుల పాటు జరగనుంది. మొత్తం 64 మ్యాచులు జరుగుతాయి. డిసెంబర్ 18న ఫైనల్ ఉంటుంది. అరబ్ దేశంలో తొలిసారిగా ఫిఫా ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 4 టీంలు ఉన్నాయి. ప్రతి టీంలోనూ టాప్ 2 లో నిలిచిన జట్టు టాప్ 16 కు అర్హత సాధిస్తుంది.
- గ్రూప్ ఏ : సెనెగల్, నెదర్లాండ్స్, ఖతార్, ఈక్వెడార్
- గ్రూప్ బి : ఇంగ్లండ్, ఇరాన్, యూఎస్ ఏ, వేల్స్
- గ్రూప్ సి : మెక్సికో, పోలాండ్, అర్జెంటీనా, సౌదీ అరేబియా
- గ్రూప్ డి : ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా
- గ్రూప్ ఈ : స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్
- గ్రూప్ ఎఫ్ : బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
- గ్రూప్ జి : బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
- గ్రూప్ హెచ్: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా
నేడు ఇంగ్లండ్- ఇరాన్ మ్యాచ్
ఫిఫా ప్రపంచకప్ లో నేడు గ్రూప్- బీ మ్యాచులో ఇంగ్లండ్- ఇరాన్ తలపడనున్నాయి. ఖలీఫా ఇంటర్నేషనల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. టాప్ 16 లో చేరే జట్లలో ఇంగ్లండ్ స్పష్టమైన ఫేవరెట్ గా ఉంది. నాకౌట్ రౌండులకు ముందు సాధించిన మూడు వరుస విజయాలు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ కంటే ఇంగ్లండ్ వేల్స్ జట్టు మెరుగైన రికార్డు కలిగి ఉంది. వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రపంచకప్ కు అర్హత సాధించారు. అలాగే ఇంగ్లండ్ జట్టు యూరోపియన్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ఖతార్ కు వచ్చింది.
మరోవైపు ఫిఫా పురుషుల ర్యాంకింగ్స్‌లో ఇరాన్ 20వ స్థానంలో కొనసాగుతోంది. గత రెండు సార్లు గ్రూప్ దశలను దాటడంలో వారు విఫలమయ్యారు. అయితే ఇప్పుడు టాప్ 16లో ఉండేందుకు ఆ జట్టు పట్టుదలగా ఉంది. అందుకే గట్టి పోటీ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది.