SAFF Championship 2023: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మంగళవారం ముగిసిన శాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత జట్టు.. పెనాల్టీ షూటౌట్ లో కువైట్ ను ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచాక కంఠీరవ స్టేడియం మొత్తం భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ‘వందేమాతరం’ అంటూ నినదించింది. స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన సుమారు 26 వేల మంది ప్రేక్షకులు.. కువైట్ పై భారత్ గెలవగానే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘మా తుఝే సలామ్’ పాటను ఆలపించారు.
పెనాల్టీ షూటౌట్ లో మ్యాచ్ గెలిచాక స్టేడియంలో ప్రేక్షకులంతా ఒక్కసారిగా పైకి నిలబడి.. వందేమాతరమ్, మా తుఝే సలామ్ అంటూ నినదించారు. వీరికి భారత సారథి సునీల్ ఛెత్రితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా జతకలిశారు. మ్యాచ్ గెలిచాక భారత ఆటగాళ్లు స్టేడియం అంతా కలియతిరుగుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
స్టేడియంలో 26వేల మంది ఒక్కసారిగా ‘వందేమాతరమ్’ అంటూ నినదించడంతో ఈ వీడియో చూస్తున్నవారికి రొమాలు నిక్కబొడుచుకోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే తొలి అర్థభాగంలోనే కువైట్ 14వ నిమిషంలో ఫస్ట్ గోల్ కొట్టింది. ఫస్టాప్ ముగుస్తుందనగా 39వ నిమిషంలో భారత ఆటగాడు చాంగ్తె భారత్ కు తొలి గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. రెండో అర్థభాగంలో ఇరు జట్లూ గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్ లో భారత్ 5-4 తేడాతో కువైట్ ను ఓడించి టైటిల్ ను నిలబెట్టుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో భారత ఆటగాడు ఉదాంత సింగ్ ఒక పెనాల్టీ ఛాన్స్ మిస్ చేయగా, మిగతా నాలుగు ప్రయత్నాల్లో విజయం సాధించి గోల్స్ చేశారు. కువైట్ సైతం 4 ప్రయత్నాల్లో విజయం సాధించింది. భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు కువైట్ ఆటగాడు హజియా పెనాల్టీని గోల్ చేయకుండా అడ్డుకోవడంతో భారత్ ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. భారత్ గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021 సంవత్సరాలలో విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో విజయంతో 9వ సారి సాఫ్ ఛాంపియన్ గా అవతరించింది. ఇటీవలే ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలిచిన భారత్ కు వరుసగా ఇది రెండో మేజర్ టైటిల్ కావడం విశేషం.