మలేషియా వేదికగా జూనియర్‌ పురుషుల అండర్‌ 21 హాకీ ప్రపంచకప్‌నకు సర్వం సిద్దమైంది. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఇదివరకు రెండుసార్లు చాంపియన్‌‌గా నిలిచిన ఇండియా మంగళవారం మొదలయ్యే తాజా టోర్నీలో సత్తా చాటి ముచ్చటగా మూడోసారి హాకీ ప్రపంచకప్‌ సాధించాలని పట్టుదలగా ఉంది. పూల్‌ సీ విభాగంలో నేడు జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో ఉత్తమ్‌ సింగ్‌ నాయకత్వంలోని టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. తొలి పోరులో బలమైన ఆసియా జట్లలో ఒకటైన కొరియాను ఢీకొననుండడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది. కొరియా జట్టుపై భారత్‌కు  మెరుగైన రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకూ ఆరుసార్లు తలపడితే భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, కొరియా రెండింటిలో నెగ్గింది. ఒక పోటీ డ్రా అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జూనియర్‌ ఆసియా కప్‌ సెమీఫైనల్లో కొరియాపై భారత్‌ 9-1తో ఘన విజయం సాధించింది. భఫార్వర్డ్‌ ఉత్తమ్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌ను, ఈనెల 9న కెనడాను ఎదుర్కోనుంది. 

 

వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యామని, ఇటీవలే కొరియాతో మ్యాట్‌ ఆడామని, అందువల్ల ఈ మ్యాచ్‌లో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో అవగాహన ఉందని.... అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రూపొందించామని భారత కెప్టెన్‌ ఉత్తమ్‌ చెప్పాడు. పూల్‌ సి విభాగంలో భారత్‌తో పాటు కొరియా, కెనడా, స్పెయిన్‌ ఉన్నాయి. ఈ పూల్‌లో భారత్‌ అగ్రస్థానంలో నిలవడం తేలికగానే కనిపిస్తోంది. పూల్‌ ‘ఎ’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, మలేసియా ఉండగా, ‘బి’లో ఈజిప్టు, ఫ్రాన్స్‌, జర్మనీ, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. బెల్జియం, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌తో పూల్‌ ‘డి’ క్లిష్టంగా ఉంది. ప్రతి పూల్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈనెల 12, 14, 16న క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌ జరగనున్నాయి. ‘ ఈనెల 16 వరకు జరిగే జూనియర్‌ పురుషుల అండర్‌ 21 హాకీ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పోటీపడుతున్నాయి.ఈ టోర్నీ మ్యాచ్‌లను స్పోర్ట్స్‌ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

 

44 ఏళ్ల చరిత్ర కలిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుసార్లు విజేతగా నిలిచింది. 2001, 2016లో భారత్ ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచింది. 1997లో రన్నరప్‌గా నిలిచింది. రెండేండ్ల కిందట భువనేశ్వర్‌‌లో జరిగిన గత ఎడిషన్ లో నాలుగో ప్లేస్‌‌తో సరిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పోడియంపైకి రావాలని కోరుకుంటోంది. కొరియాతో పాటు కెనడా, స్పెయిన్‌‌తో కూడిన సులువైన పూల్‌‌–సిలో బరిలోకి దిగుతోంది. గురువారం స్పెయిన్‌‌తో, శనివారం కెనడాతో తలపడనుంది.

భారత జట్టు: ఉత్తమ్‌ సింగ్‌ (కెప్టెన్‌), అరైజిత్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆదిత్య, సౌరభ్, సుదీప్, బాబీ సింగ్, మోహిత్, రణ్‌విజయ్, శార్దానంద్, అమన్‌దీప్‌ లాక్రా, రోహిత్, సునీల్, అమీర్‌ అలీ, విష్ణుకాంత్, పూవణ్ణ, రాజిందర్‌ సింగ్, అమన్‌దీప్, ఆదిత్య సింగ్‌.