SSC Fee Last Date: తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. డిసెంబరు 7 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 14 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 21 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఫీజు చెల్లింపు తేదీలు..
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 07.12.2023.
➥ రూ.50 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.12.2023.
➥ రూ.200 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.12.2023.
➥ రూ.500 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 03.01.2024.
ఫీజు చెల్లింపు వివరాలు..
➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125
➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.110
➥ 3 సబ్జెక్టులకు మించి పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.125.
➥ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.60.
వీరికి ఫీజు నుంచి మినహాయింపు..
* కుంటంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు మించకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకూడదు (లేదా) 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
తెలంగాణలో పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని తెలిపారు. గతేడాది నుంచి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యూల్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌ను ఇక మీద నుంచి ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో పాఠశాల విద్యార్థుల సమగ్ర సమాచారాన్ని పొందుపరిచే 'యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)'లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అక్టోబరు 16న కీలక నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలకు ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు, ఇతర సమగ్ర వివరాలతో కూడిన నామినల్‌రోల్స్‌ను పంపిస్తాయి. అనుమతి లేని పాఠశాలల్లో చదివే పిల్లలను మరో బడి నుంచి పరీక్షలు రాయిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ఇప్పటి నుంచి యూడైస్‌లో పేరు ఉంటేనే పదోతరగతి పరీక్షలకు అనుమతి ఇస్తారు.
ఏపీలోనూ పొడిగింపు..
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. రూ.200 ఆలస్యరుసుముతో డిసెంబరు 5 నుంచి 9 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 10 నుంచి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.