India Vs England Test Match Updates: జేమ్స్ ఆండర్సన్ టెస్ట్‌ల్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. భారత్ తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో 700 వికెట్లు సాధించి ప్రపంచంలో ఏ ఫాస్ట్ బౌలర్ కి అందని రికార్డ్ ని తన పేరిట లిఖించుకొన్నాడు. ధర్మశాలలో భారత్ తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో జేమ్స్ ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. భారత మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో కుల్‌దీప్‌యాదవ్ ని అవుట్ చేయడం ద్వారా సరికొత్త చరిత్రని లిఖించాడు. టెస్ట్‌ల్లో 700 వికెట్లని సాధించిన మూడో బౌలర్‌గా తొలి ఫాస్ట్‌బౌలర్‌గా నిలిచాడు.
దద్దరిల్లిన ధర్మశాల
ధర్మశాల టెస్ట్‌లో భాగంగా రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ కాసేపటికే కుల్‌దీప్ యాదవ్ వికెట్ కోల్పోయింది. తన పదునైన పేస్ తో వేసిన బంతిని కుల్‌దీప్‌యాదవ్ బ్యాట్ ని తాకుతూ వికెట్ కీపర్ ఫోక్స్ చేతిలో పడింది. ఈ వికెట్‌తో పాటు తన కెరీర్ లో 700 వికెట్ సాధించాడు అండర్సన్. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకొన్నారు. తన స్వింగ్, పేస్‌తో ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించిన తమ సహచరుడు 700 వికెట్లు కూల్చడమే కాక ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్ అవ్వడంతో ఇంగ్లండ్ ప్లేయర్లు 41 ఏళ్ల ఆండర్సన్ ని అభినందనలతో ముంచెత్తారు.
ఎవరు ముందున్నారు...
ఇప్పటివరకు టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ముత్తయ్యమురళీధరణ్ తొలిస్థానంలో ఉన్నాడు. శ్రీలంక తరఫున 800 వికెట్లు సాధించిన మురళీ అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత ఆస్ర్టేలియా స్పిన్నర్ షేన్‌వార్న్‌రెండో స్థానంలో ఉన్నాడు. 708 వికెట్లతో వార్న్ ఈ రికార్డ్ సాధించాడు. వీళ్లిద్దరూ స్పిన్నర్లే కావడంతో అత్యధిక వికెట్ల క్లబ్‌లో ఏ ఫాస్ట్‌బౌలర్ లేనట్లయ్యింది. ఈ లోటు తీరుస్తూ ఆండర్సన్ 700 వికెట్లతో చరిత్ర సృష్టించాడు. ఆండర్సన్ తర్వాత భారత స్పిన్ దిగ్గజ్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో, ఇంగ్లండ్ కే చెందిన స్టువర్ట్‌బ్రాడ్ 604 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఆరంగేట్రం...
జేమ్స్ ఆండర్సన్ 2003 లో లార్డ్స్ మైదానంలో జింబాంబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తరఫున టెస్ట్‌ల్లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 187 టెస్ట్‌మ్యాచ్‌లు ఆడిన జిమ్మీ 700 వికెట్లు సాధించాడు. ఆండర్సన్ ఒక ఇన్నింగ్స్‌లో 42 పరుగులకు 7 వికెట్లు తీయడం అత్యుత్తమ గణాంకాలు. టెస్ట్‌ల్లో పదివికెట్లు 3 సార్లు, 5 వికెట్లు 32 సార్లు కూల్చి తన జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు. అంతేకాదు వన్డేల్లో 269 వికెట్లు తీసాడు. వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు 23 పరుగులకు 5 వికెట్లు.
అరుదు...
ఇక సహజంగా ఫాస్ట్ బౌలర్ల కెరియర్ ఎక్కువకాలం ఉండదు, తరుచుగా గాయాల పాలవుతుంటారు. దీంతో ఆటకు దూరమవడం, మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చినా మునుపటి లయ అందుకోవడం కష్టంగానే ఉంటుంది. కానీ జిమ్మీ గాయాలపాలయ్యినా మళ్లీ రెట్టించిన వేగంతో జట్టులోకి వచ్చేవాడు. తనకే సొంతమైన ఇన్‌స్వింగ్ యార్కర్లతో బ్యాట్స్‌మెన్ ను ముప్పుతిప్పలు పెట్టేవాడు. పిచ్ ఏమాత్రం స్వింగ్‌కి అనూకూలించినా చెలరేగిపోయే ఆండర్స్‌న్ ని ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్‌మెన్‌కి అయినా సవాల్‌గానే నిలిచేది.
సహజంగా ఫాస్ట్ బౌలర్లు స్లెడ్జింగ్ చేస్తుంటారు. వికెట్ దక్కకపోతే అసహనం ప్రదర్శిస్తుంటారు. కానీ ఆండర్సన్ స్లెడ్జింగ్ చేయడం అరుదనే చెప్పాలి. ప్రతర్ధులను బౌలింగ్‌తోనే భయపెట్టేవాడు. ఇక ధర్మశాల టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమిదిశగా వెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోలేక, భారత స్పిన్ ని ఎదుర్కోలేక బ్యాట్స్‌మెన్ పెవిలియన్ కి క్యూ కడుతున్నారు.