CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్‌కెళ్లే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న అమ్మాయిలు కాంస్య పతకంతో మురిశారు. మూడో స్థానం కోసం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో అద్భుత విజయం సాధించారు. రెండు జట్లు 1-1తో మ్యాచ్‌ను ముగించడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులో 2-1తో ప్రత్యర్థిని ఓడించి పతకం గెలిచారు.






ఆరంభం నుంచే మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. రెండు జట్లు గోల్‌ కోసం విపరీతంగా శ్రమించాయి. తొలి క్వార్టర్లో బంతిని తమ అధీనంలో ఉంచుకొనేందుకు ప్రయత్నించాయి. సంగీతా కుమారి తన ఆటతో మురిపించింది. రెండో క్వార్టర్లో సలీమా టెటె గోల్‌ కొట్టి భారత్‌ను 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. మూడో క్వార్టర్లో కివీస్‌ గోల్‌ కొట్టినట్టు అనిపించినా రివ్యూ తీసుకొన్న టీమ్‌ఇండియా గెలిచింది. ఆట మరో 17 సెకన్లలో ముగుస్తుందనగా న్యూజిలాండ్ స్కోర్‌ సమం చేసి షూటౌట్‌ను ఖాయం చేసింది. 


పెనాల్టీ షూటౌట్లో మొదటి ప్రయత్నంలోనే న్యూజిలాండ్ 1-0తో దూసుకెళ్లింది. టీమ్‌ఇండియా తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండోసారి గోల్‌ కొట్టి 1-1తో సమం చేసింది. మరో ప్రయత్నంలోనూ గోల్‌ రావడంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కివీస్‌ నుంచి ప్రతిఘటన లేకపోవడంతో విజయం సాధించింది.