Priyanka Goswami CWG 2022: భారత అథ్లెట్‌ ప్రియాంక గోస్వామి చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సాధించింది. 10వేల మీటర్ల నడకలో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచింది. వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ 43:38:83తో నడకను పూర్తి చేసింది. 2010 దిల్లీ కామన్వెల్త్‌ పోటీల్లో 20 కి.మీ పరుగులో హర్మిందర్‌ సింగ్‌ కాంస్యం రికార్డును ఆమె బద్దలు కొట్టింది. గెలిచిన పతకాన్ని ఆమె 'లడ్డూ గోపాలుడు'కి అంకితమివ్వడం ప్రత్యేకం. 






ప్రియాంక గెలిచిన పతకం కామన్వెల్త్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు మూడోది కావడం ప్రత్యేకం. అంతకు ముందు హైజంప్‌లో తేజస్వినీ శంకర్‌ కాంస్యం, లాంగ్‌ జంప్‌లో ఎం.శ్రీశంకర్‌ రజతం గెలిచారు. సుదీర్ఘ నడకలో 4000 మీటర్ల వరకు ప్రియాంకే ముందుంది. ఆ తర్వాత రెండు స్థానాలు వెనక్కి వెళ్లింది. 8000 మీటర్ల వరకు అదే స్థానంలో కొనసాగింది. చివరి 2000 మీటర్లకు జోరందుకొని రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. రజతం కైవసం చేసుకుంది. 42:34 నిమిషాలతో ఆస్ట్రేలియా అమ్మాయి జెమీమా మాంటాగ్‌ స్వర్ణం అందుకుంది. ఇదే రేసులో పాల్గొన్న మరో భారతీయురాలు భావనా జాట్‌ 47:14:13 నిమిషాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.


ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ప్రియాంకకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఏ దేశానికి వెళ్లినా, ఏ టోర్నీలో పాల్గొన్నా చిన్ని కృష్ణయ్య విగ్రహాన్ని తీసుకెళ్తుంది. ఆయన్ను తీసుకెళ్లడం అదృష్టంగా భావిస్తుంది. గెలిచిన తర్వాత పతకం అందుకుంటున్నప్పుడు పోడియం వద్దకూ తీసుకెళ్లి చేతిలో ఉంచుకుంటుంది. ఈ విగ్రహాన్ని ఆమె 'లడ్డూ గోపాల్‌'గా పిలుచుకుంటుంది. కామన్వెల్త్‌లో రజతం బహూకరించేటప్పుడు లడ్డూ గోపాలుడు ఆమె చేతిలోనే ఉన్నాడు. అలాగే పోటీలు జరిగే దేశాల జాతీయ పతకాల రంగులను గోళ్లకు వేసుకోవడం ఆమెకు అలవాటు.






'కామన్వెల్త్ సుదీర్ఘ నడకలో భారత్‌కు తొలి రజతం అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు స్వర్ణం గెలిచిన అమ్మాయితే గత కామన్వెల్త్‌లో పసిడి విజేత. వచ్చేసారి స్వర్ణం కోసం ప్రయత్నిస్తా. నా వల్ల మువ్వన్నెల జెండా రెపరెపలాడినందుకు గర్వంగా అనిపిస్తోంది. నాతో పాటు కృష్ణయ్య ఉన్నాడు. ప్రతి పోటీకీ ఆయన్ను నాతో తీసుకెళ్తా. ఈ రోజు ఆయన నాకు అదృష్టం తీసుకొచ్చాడు' ప్రియాంక తెలిపింది.


'భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌ ఉన్నాయి. నా చేతివేళ్ల గోళ్ల రంగులు నేను వెళ్లిన దేశాలను ప్రతిబింబిస్తాయి. నా పతకాన్ని నా లడ్డూ గోపాలుడు, నా కుటుంబానికి అంకితమిస్తున్నా' అని ప్రియాంక వెల్లడించింది.