CWG 2022: భారత 'బంగారు కొండ' మీరాబాయి చాను స్వదేశానికి చేరుకుంది. ఇన్నాళ్లూ పతక అంచనాల బరువును మోసిన ఆమె రాగానే హాయిగా సేదతీరింది. వచ్చీ రాగానే ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్‌ చేసేసింది. ఆమెతో పాటు మరికొందరు వెయిట్‌ లిఫ్టర్లూ వచ్చేశారు.


కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌ మీరాబాయి చాను. ఆమె పతకాల బోణీ చేస్తే మామూలుగా ఉండదు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఆమే పతక బోణీ చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం కైవసం చేసుకుంది. బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లోనూ అంతే. 49 కేజీల విభాగంలో బంగారు పతకం పట్టేసింది. స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలు ఎత్తి మిగతా అథ్లెట్లకు అందనంత ఎత్తులో నిలిచింది. సరికొత్త రికార్డులు సృష్టించింది.




వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ ఎంతో కీలకం. నిరంతరం దేహ దారుఢ్యం కోసం శ్రమిస్తుంటారు. విపరీతంగా కసరత్తులు చేస్తారు. నాణ్యమైన ఆహారం తీసుకుంటారు. మాంస కృత్తులు, మంచి ఫ్యాట్‌ కలిగిన ఆహారం తింటారు. ఇందుకోసం రుచికరమైన జంక్‌ ఫుడ్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కెలోరీలు ఉండే ఆహారాన్ని వదిలేయాల్సి ఉంటుంది. కామన్వెల్త్‌ కోసం మీరాబాయి చానూ ఇలాగే చేసింది. స్వర్ణం గెలిచి రాగానే 'కడక్‌ ఛాయ్‌', మసాలా దోశెను ఆర్డర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


2018లోనూ స్వర్ణం


మీరాబాయి దేశంలో అత్యంత ఆదరణ ఉన్న వెయిట్ లిఫ్టర్లలో ఒకరు. 2022లో మళ్లీ స్వర్ణ పతకం సాధించిన ఆమె ఇప్పటికే 2014 కామన్వెల్త్ గేమ్స్ లో రజతం, 2018 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలిచింది. ఆమె 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ పతకాలు, ఆసియా ఛాంపియన్‌షిప్ పతకాలను కూడా ఆమె సాధించింది. టోక్యో ఒలింపిక్ క్రీడలలో భారతదేశానికి రజత పతకం అందించిన రికార్డులకెక్కింది మీరాబాయి చాను.