FM Nirmala Sitharaman on Cryptocurrency Ban: పరిశ్రమ వర్గాలు, నిపుణులు, విశ్లేషకులతో చర్చించిన తర్వాతే క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించాలో లేదో నిర్ణయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. పన్నులు వేస్తున్నంత మాత్రాన అవి చట్టబద్ధమైనవి కావని స్పష్టం చేశారు. ఏదేమైనా పన్నులు వేయడం ప్రభుత్వానికున్న సార్వభౌమాధికార హక్కుగా వెల్లడించారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె శుక్రవారం సమాధానం ఇచ్చారు.


పన్ను వేస్తే చట్టబద్ధం కాదు!


'ప్రస్తుత దశలో నేను వాటిని చట్టబద్ధం చేయడం లేదు. అలాగని నిషేధమూ విధించడం లేదు. చర్చల ద్వారా పూర్తి సమాచారం అందాకే నిషేధం విధించాలో లేదో నిర్ణయించుకుంటాం' అని నిర్మలా సీతారామన్‌ అన్నారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై వచ్చే లాభాలపై పన్నులు వేయడంపై ఆమె వివరణ ఇచ్చారు. 'క్రిప్టో కరెన్సీ చట్టబద్ధమా కాదా అన్నది మరో ప్రశ్న. కానీ నేను పన్నులు విధిస్తా. ఎందుకంటే ఇది సార్వభౌమాధికార హక్కు. పన్నులు విధించినంత మాత్రాన అది చట్టబద్ధమైనట్టు కాదు' అని వెల్లడించారు.


కుంచిచుకుపోయిన ఆర్థిక వ్యవస్థ


కరోనా వైరస్‌ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత సంకోచించిందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇబ్బందులు ఎదురైనా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 6.2 శాతం లోపే ఉంచేందుకు శ్రమించామని పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి, స్థిరత్వానికి కొనసాగింపు ఉంటుందన్నారు. స్టార్టప్‌ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, కరోనాలో మొదలైన కొన్ని కంపెనీలు యూనికార్నులుగా మారాయని వెల్లడించారు.


30 శాతం పన్ను


బడ్జెట్‌ ప్రసంగంలో డిజిటల్‌ ఆస్తులపై 30 శాతం పన్ను విధిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఒకవేళ వీటిని బహుమతిగా ఇచ్చినా స్వీకర్త పన్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. 'ఏదైనా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులను బదిలీ చేయడం ద్వారా వచ్చిన ఆదాయంపై 30 శాతం పన్ను ప్రతిపాదిస్తున్నాను. అలాంటి ఆదాయాన్ని గణిస్తున్నప్పుడు సొంతం చేసుకోవడానికి అయ్యే ఖర్చును తప్ప.. ఎలాంటి మినహాయింపు, అలవెన్స్‌ను ఇవ్వడం లేదు' అని ఆమె అన్నారు. డిజిటల్‌ అసెట్స్‌ ద్వారా వచ్చే నష్టాన్ని ఎలాంటి ఆదాయంపై సెటాఫ్‌ చేసేందుకు వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి లావాదేవీలను గుర్తించేందుకు  డిజిటల్‌ అసెట్స్‌ చెల్లింపులపై ఒకశాతం టీడీఎస్‌ను అమలు చేస్తామన్నారు.


Also Read: క్రిప్టో కరెన్సీపై RBI అప్‌డేట్‌! శక్తికాంత దాస్‌ది మళ్లీ మళ్లీ అదే మాట!


Also Read: స్టాక్‌ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.10 లక్షల కోట్లు- ఒక్క రిలయన్స్‌లోనే రూ.లక్ష కోట్లు