దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో కరెన్సీతో ముప్పు పొంచివుందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరోసారి  హెచ్చరించారు. వర్చువల్‌ కాయిన్లకు లోబడిన ఆస్తులేవీ (అండర్‌లైయింగ్‌ అసెట్స్‌) లేవని స్పష్టం చేశారు. కనీసం తులిప్ పువ్వులు కూడా లేవన్నారు. 'ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించే ఆర్‌బీఐ సామర్థ్యాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీస్తాయి' అని ఆయన స్పష్టం చేశారు.


క్రిప్టో కరెన్సీలపై దాస్‌ గతంలోనూ ఇలాగే వ్యాఖ్యలు చేశారు. వాటితో ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఉంటుందని ప్రకటించారు. బడ్జెట్లో క్రిప్టోలపై 30 శాతం పన్ను విధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి. అయితే క్రిప్టో కొనుగోళ్లు, అమ్మకాలకు చట్టబద్ధత కల్పించడాన్ని మాత్రం సంబంధిత స్టేక్‌ హోల్డర్లు ఆహ్వానిస్తున్నారు.


'2022-23 ఆర్థిక ఏడాదిలోనే ఆర్‌బీఐ డిజిటల్‌ రూపాయిని ఆవిష్కరిస్తాం. ఎప్పుడు విడుదల చేస్తామన్న టైమ్‌లైన్‌ను ఇప్పుడే చెప్పలేం. అయితే డిజిటల్‌ రూపాయి, సాధారణ రూపాయి మధ్య ఎలాంటి తేడా ఉండదు. కానీ క్రిప్టో కరెన్సీని బయటి వ్యక్తులు సృష్టిస్తారు. దాంతో ఆర్థిక భద్రత, స్థిరత్వం దెబ్బతింటుంది' అని దాస్‌ మీడియాతో సమావేశంలో అన్నారు.







'సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (CBDC) టైమ్‌లైన్‌ ఇవ్వం. నేను మీకు చెప్పేదొక్కటే. మేం చేయాలనుకున్నది అత్యంత అప్రమత్తత, జాగ్రత్తతో చేస్తాం. సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ ప్రతిదాడులను దృష్టిలో పెట్టుకొనే చేస్తాం. అందుకే మేం నిర్దిష్ట కాల వ్యవధిని చెప్పడం లేదు' అని శక్తికాంత దాస్‌ అన్నారు. 'సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీపై పని జరుగుతోంది. ప్రతిపాదన మేరకు చట్టాన్ని సవరించగానే మా కాన్సెప్టులతో పైలట్‌ ప్రాజెక్టులు మొదలవుతాయి' అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రవి శంకర్‌ వెల్లడించారు.


గురువారం ఉదయం ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష ఫలితాలను శక్తికాంత దాస్‌ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. కీలక వడ్డీరేట్లలో వరుసగా పదోసారీ ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటును 4 శాతంగానే ఉంచారు. 3.35 శాతంగా ఉన్న రివర్స్‌ రెపో రేటునూ సవరించలేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.


Also Read: ఉద్యోగం మారితే పాత సాలరీ అకౌంట్‌కు ఫైన్‌ వేస్తారా? నిబంధనలు మారతాయా?


Also Read: ఐటీ శాఖ అప్‌డేట్‌ - ఏడాదికి ఒకసారి అప్‌డేటెడ్‌ ITR దాఖలుకు అవకాశం