Yash Dayal Debut: బంగ్లాదేశ్(Bangladesh)తో టెస్ట్ సిరీస్‌కు 16 మందితో భారత(India) జట్టును ఇప్పటికే ప్రకటించారు. అయితే టీమిండియాలో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్(Yash Dayal)కు చోటు దక్కడం అందరినీ కాస్త ఆశ్చర్యపరిచింది. సీనియర్ పేసర్లను కాదని యశ్‌ను జట్టులోకి తీసుకున్నారు. బంగ్లాతో సిరీస్‌లో టెస్టుల్లోకి యశ్ దయాల్ అరంగేట్రం చేయనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా బీ తరపున బరిలోకి దిగిన యశ్ పర్వాలేదనిపించాడు. అయితే యశ్ ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. పలువురు మాజీలు దయాల్ ఎంపికపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
అనుభవం లేకపోయినా...
యశ్ దయాల్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) తరఫున ఆడుతున్నప్పుడు యశ్ దయాల్ వార్తల్లో నిలిచాడు. ఒక ఓవర్‌లో 29 పరుగులు చేయాల్సిన దశలో.. యశ్ దయాల్ బౌలింగ్‌లోనే రింకూ సింగ్ అయిదు సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌ల్లో ఆడిన యశ్ దయాల్ 15 వికెట్లు తీశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ క్రికెటర్లతో మ్యాచులు ఆడుతున్నా.. యష్ ఇంకా టీమిండియా తరపున అరంగేట్రం కూడా చేయలేదు. అనుభవం లేకపోవడం బంగ్లాతో టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు దేశవాళీలోనూ యశ్ పెద్దగా మ్యాచులు ఆడలేదు. కేవలం 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ సీనియర్ ఆటగాళ్లను కాదని... యశ్‌ను జట్టులోకి తీసుకున్నారు. పేసర్ ముఖేష్ కుమార్ కొన్నేళ్లుగా రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ తరపున మూడు టెస్టుల్లో కూడా ఆడాడు. ముఖేష్ 2022-23 రంజీ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. అయినా అతడిని కాదని యశ్‌ను జట్టులోకి తీసుకోవడం విశేషం.
అర్ష్‌దీప్ ఉన్నాడు కదా...
టీమిండియాలోకి లెఫ్టార్మ్ సీమర్ కావాలనే యశ్ దయాల్‌ను తీసుకుంటే ఇప్పటికే జట్టులో అర్ష్‌దీప్ సింగ్ (Arshadeep Singh)ఉన్నాడని మాజీలు గుర్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని అర్ష్‌దీప్ సింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ అర్ష్‌దీప్‌ను ఎంపిక చేయకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. యష్ దయాల్‌కు విదేశాల్లో ఆడిన అనుభవం చాలా తక్కువ. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో భారత్ చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు యశ్ దయాల్ అసలు ప్రాబబుల్స్‌లో కూడా లేడు. కానీ ఒకే ఒక్క దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా అతన్ని జట్టులోకి తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి . అయితే యశ్ దయాల్ ఒక అవకాశం పొందేందుకు అర్హుడని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సెప్టెంబర్ 19న చెన్నైలో ప్రారంభమయ్యే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో.. బంగ్లా టైగర్స్‌తో టీమిండియా తలపడనుంది. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ చేరారు. యువ ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ కూడా ఈ సిరీస్‌లో సత్తా చాటాలని చూస్తున్నారు.