Sri Lanka Won On England Soil After Ten Years:
నామమాత్రమైన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్(ENG)పై శ్రీలంక(SL) ఘన విజయం సాధించింది. మూడో టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు గెలిచిన బ్రిటీష్ జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఇక నామామత్రంగా మారిన మూడో టెస్టులో ఇంగ్లండ్ జట్టుపై శ్రీలంక ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత ఇంగ్లండ్(England) గడ్డపై శ్రీలంక విజయం సాధించింది. ఈ మూడు టెస్టుల సిరీస్‌లో 0-2తో వెనుకబడిన లంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో బ్రిటీష్ జట్టుపై గెలిచింది.
మ్యాచ్ సాగిందిలా...
ఈ మూడో టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగుల స్కోరు చేసింది. ఓలి పోప్ కేవలం 156 బంతుల్లోనే 154 పరుగులు చేశాడు. పోప్ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఓపెనర్ బెన్ డకెట్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 79 బంతులు ఎదుర్కొన్న డకెట్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్రిటీష్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. పోప్, డకెట్ మినహా మరే ఇంగ్లండ్ ఆటగాడు కూడా కనీసం 20 పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయాడు. దీంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 325 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో రత్నాయకే మూడు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక... 263 పరుగులకే కుప్పకూలింది. పాతుమ్ నిసంక వన్డే తరహాలో చెలరేగిపోయాడు, కేవలం 51 బంతులే ఎదుర్కొన్న నిసంక 64 పరుగులు చేశాడు. ధనుంజయ డిసిల్వా 69, కుశాల్ మెండీస్ 64 పరుగులతో రాణించాడు. దీంతో లంక 263 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 62 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో బ్రిటీష్ జట్టు గెలుపు ఖాయమనే అంతా అనుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ అనూహ్యంగా 156 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ 67, లారెన్స్ 35 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కూడా కలుపుకుని శ్రీలంక ముందు 219 పరుగుల లక్ష్యం నిలిచింది. బ్రిటీష్ జట్టు బౌలర్లను ఎదుర్కొంటూ లంక ఈ టార్గెట్‌ను ఛేదించడమే కష్టంగానే అనిపిచింది. అయితే పాతుమ్ నిస్సాంక పోరాడాడు. అద్భుత సెంచరీతో దాదాపు దశాబ్దం తర్వాత లంకను గెలిపించాడు. 124 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో నిసంక 127 పరుగులు చేయడంతో లంక విజయం సాధించింది. ఏంజెలో మాథ్యూస్ 32 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయినా ఇంగ్లండ్ 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.
144 ఏళ్ల టెస్ట్ చరిత్రలో తొలి బ్యాటర్
శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిసంక(Nissanka) అరుదైన రికార్డు సృష్టించాడు. 144 ఏళ్ల చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 41 బంతుల్లో 50 పరుగులు చేసిన నిసంక.. రెండో ఇన్నింగ్స్‌లో 42 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.