Jannik Sinner beats Taylor Fritz in finals becomes first Italian man to lift the cup: ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంకర్‌.. ఇటలీ స్టార్‌ జనిక్ సినర్‌(Jannik Sinner) చరిత్ర సృష్టించాడు. యూఎస్‌ ఓపెన్‌ పురుషుల గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన తొలి ఇటలీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో ఫైనల్లో అమెరికా ప్లేయర్‌ టేలర్ ఫ్రిట్జ్‌(Taylor Fritz)పై 6-3, 6-4, 7-5 తేడాతో సినర్‌ చిరస్మరణీయ విజయం సాధించాడు. రెండు గంటల 16 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో సినర్‌.. ఒత్తిడిని అధిగమిస్తూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి సెట్‌ నుంచే సినర్‌ ఆధిపత్యం ఆరంభమైంది. ఆ తర్వాత మరో రెండు సెట్లను కైవసం చేసుకుని సినర్‌ తన కలను నెరవేర్చుకున్నాడు. మరోవైపు ఈసారైనా యూఎస్‌ ఓపెన్ టైటిల్‌( US Open title) వస్తుందన్న అమెరికా అభిమానుల కల నెరవేరలేదు. 20 ఏళ్లుగా అమెరికాకు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్ రాలేదు. ఈసారి టేలర్‌ ఫ్రిట్జ్‌ ఫైనల్‌కు చేరి ఆశలు రేపినా సినర్‌ ముందు తేలిపోయాడు. గత 15 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరిన తొలి అమెరికా ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఫ్రిట్జ్‌... ఫైనల్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోయాడు. ఈ ఏడాదిలో సినర్‌కు ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ కావడం విశేషం. జనవరిలో సినర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ గ్రాండ్‌  స్లామ్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. 





 

గెలుపు అత్తకు అంకితం

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తకు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ విజయాన్ని అంకితమిస్తున్నట్లు సినర్‌ ప్రకటించాడు. యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన అనంతరం తీవ్ర భావోద్వేగంతో  కంటతడి పెట్టుకున్న సినర్‌... ఈ ప్రకటన చేశాడు. తన అత్త  తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతోందని వెల్లడించాడు. "నా జీవితంలో మా అత్త ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ ఈ క్షణాలను ఆమెతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆమె నా జీవితంలో ఆమె అత్యంత ముఖ్యమైన, ప్రభావవంతమైన వ్యక్తి " అని సినర్‌ బోరుమన్నాడు. "నేను టెన్నిస్‌ని ప్రేమిస్తున్నాను. ఈ దశకు చేరుకుందనేందుకు చాలా కష్టపడ్డాను." అని సినర్‌ తెలిపాడు. 





 

నా ప్రయాణం అంత తేలిక కాదు

సినర్‌పై గతంలో డ్రగ్స్‌ వాడారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపైనా సినర్‌ స్పందించాడు. తన గత ప్రయాణం అంత తేలిగ్గా సాగలేదని తెలిపాడు. ఈ టైటిల్‌ సాధించేందుకు చాలా శ్రమించానని వెల్లడించాడు. తాను ఈ స్థాయికి చేరుకునేందుకు సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని  సినర్ తెలిపాడు. ఈ సీజన్‌లో తాను చాలా పెద్ద విజయాలు సాధించానని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలిచానని.. అప్పుడే తనకు ఆత్మ విశ్వాసం పెరిగిందని సినర్‌ వెల్లడించాడు. " నేను ఇంకా మెరుగుపడగలనని నాకు తెలుసు. కానీ ఇప్పుడు సాధించిన దానితో నేను గర్వడతాను." అని తెలిపాడు.