Royal Challengers Bangalore win by 8 wickets: వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2024)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers) వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌పై( Gujarat Giants) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ లీగ్‌లో రెండో మ్యాచ్‌ ఆడుతున్న గుజరాత్‌ మరోసారి బ్యాటింగ్‌లో విఫలమైంది.  మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు. బెంగళూరు బౌలర్లలో సోఫీ మోలినెక్స్ 3, రేణుకా ఠాకూర్‌సింగ్‌ 2, జార్జియా వారెహమ్‌ ఒక వికెట్‌ తీసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి బ్యాటర్లను కట్టుదిట్టంగా బంతులు వేసి హడలెత్తించారు. దయాలన్ హేమలత 31, హర్లీన్‌ డియోల్ 22 ఫర్వాలేదనిపించడంతో.. గుజరాత్‌ 7 వికెట్ల నష్టానికి 107 పరుగులైనా చేయగలిగింది. వారిద్దరూ ఆడకుంటే ఇంకా తక్కువ స్కోర్‌కే గుజరాత్ జెయింట్స్‌ పరిమితమయ్యేది. అనంతరం బెంగళూరు కెప్టెన్‌ స్మృతీ మంధాన (43), సబ్బినేని మేఘన (35), ఎల్సీ పెర్రీ (23) రాణించడంతో.. 108 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. కేవలం 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది.


ఢిల్లీ విజయం..
వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2024)లో యూపీ వారియర్స్‌(UP Warriorz)పై ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) ఘన విజయం సాధించింది. తొలుత బంతితో ఆ తర్వాత బ్యాటుతో ఢిల్లీ చెలరేగిపోయింది. ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ 120పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో కేవలం ఒకే వికెట్‌ కోల్పోయి సునాయసంగా చేధించింది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (64*), మెగ్‌ లానింగ్‌ (51) అర్ధశతకాలతో మెరిశారు.


యూపీ కట్టడి
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు యూపీ బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్వేతా షెహ్రవాత్‌ (45), గ్రేస్‌ హారిస్‌ (17), ఎలీసా హీలే (13) మినహా ఎవరూ 10 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. రాధా యాదవ్ 4, మారిజాన్ కాప్ 3 అరుంధతి రెడ్డి, అనాబెల్ సదర్లాండ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. భారీ షాట్లతో విరుచుకుపడి ఢిల్లీకి సునాయస విజయాన్ని అందించింది.


ముంబైకి మరో విజయం
మహిళల ఐపీఎల్‌ (WPL) 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గుజరాత్‌ జెయింట్స్‌(Gujarat Giants )తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ కేవలం 126 పరుగులే చేయగా.. 127 పరుగుల లక్ష్యాన్ని ముంబై సునాయసంగా ఛేదించింది.