WPL 2023: తొలి దశ ముగింపునకు చేరిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ప్లేఆఫ్ రేసులో నేడు యూపీ వారియర్స్ తో కీలక మ్యాచ్ ఆడనున్న గుజరాత్ జెయింట్స్ ఓ వివాదంలో చిక్కుకుంది. తొలి సీజన్ కు ముందు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డియాండ్రా డాటిన్ ను వేలంలో కొనుగోలు చేసిన గుజరాత్.. తర్వాత తొలి మ్యాచ్ కు ముందే ఆమెను తప్పించింది. డాటిన్ ను తప్పించడానికి గుజరాత్ చెప్పిన కారణంపై తాజాగా ఆమె స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసింది.
వివాదమిది...
గత నెలలో ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలంలో గుజరాత్ జెయింట్స్.. రూ. 60 లక్షలు వెచ్చించి డాటిన్ ను కొనుగోలు చేసింది. అయితే సీజన్ లో తొలి మ్యాచ్ కు ముందే ఆమె ఆడేందుకు ఫిట్ గా లేదనే కారణంతో డాటిన్ ను తప్పించి ఆ స్థానంలో ఆసీస్ పేసర్ కిమ్ గార్త్ ను రిప్లేస్ చేసుకుంది. తనను తప్పించడంపై డాటిన్ గతంలోనే స్పందిస్తూ.. ‘నేను ఫిట్ గానే ఉన్నా.. అయినా ఎందుకు తప్పించారో అర్థం కావడంలేదు..’అని తెలిపింది. డాటిన్ కామెంట్స్ పై గుజరాత్ తర్వాత ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘డాటిన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. మాతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఆమె నిర్ణీత గడువుకు ముందు మెడికల్ క్లీయరెన్స్ సర్టిఫికెట్స్ తీసుకురాలేదు. లీగ్ లో ఆడేందుకు ప్రతీ క్రికెటర్ కు ఈ సర్టిఫికెట్ అవసరం అన్న నిబంధన ఉంది..’ అని పేర్కొంది.
డాటిన్ వివరణ...
కాగా గుజరాత్ ప్రకటనపై డాటిన్ తాజాగా సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ట్విటర్ వేదికగా ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ‘నేను గతేడాది డిసెంబర్ లో చిన్న కడుపు నొప్పితో బాధపడ్డాను. కానీ దానికి అప్పుడే చికిత్స తీసుకున్నాను. ఈ మేరకు గుజరాత్ ఫిజియెథెరపిస్టుతో జరిపిన ప్రత్యుత్తరాలలో ఈ విషయం గురించి నేను వాళ్లకు స్పష్టంగా తెలియజేశాను. కానీ ఆ తర్వాత ఇందులో సమాచార లోపం వల్ల నేను ఇంకా కడుపు నొప్పితో బాధపడుతున్నాని మేనేజ్మెంట్ వాళ్లకు తెలిసింది...’ అని తెలిపింది. వాస్తవానికి తాను గత నెల 20నే ఫ్రాంచైజీకి మెడికల్ క్లీయరెన్స్ సర్టిఫికెట్ అందజేశానని డాటిన్ చెప్పుకొచ్చింది. తాను రిపోర్టులను ఇచ్చినప్పటికీ మళ్లీ కొత్త స్కానింగ్ రిపోర్టులు అడిగారని ప్రకటనలో పేర్కొంది. ఈ సీజన్ నుంచి తప్పుకున్నందుకు చాలా నిరశగా ఉన్ననాని డాటిన్ తెలిపింది.
కాగా డబ్ల్యూపీఎల్ లో ప్లేఆఫ్స్ బరిలో నిలిచిన ఆ జట్టు నేడు యూపీ వారియర్స్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ ఏం చేస్తుందోనని ఆ జట్టు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.