WPL 2023, RCB-W vs GG-W:


గుజరాత్‌ జెయింట్స్‌ సింహగర్జన చేసింది. విమెన్‌ ప్రీమియర్‌ లీగులో తొలి విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. 202 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 190/6కి పరిమితం చేసింది. 11 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. కాగా ఆర్సీబీకి ఇది హ్యాట్రిక్‌ ఓటమి. ఓపెనర్‌ సోఫీ డివైన్‌ (66; 45 బంతుల్లో 8x4, 2x6) ఒంటరి పోరాటం చేసింది. ఎలిస్‌ పెర్రీ (32) ఆమెకు తోడుగా నిలిచింది. అంతకు ముందు జెయింట్స్‌లో సోఫీ డంక్లీ (65; 28 బంతుల్లో 11x4, 3x6), హర్లీన్‌ డియోల్‌ (67; 45 బంతుల్లో 9x4, 1x6) కసికసిగా హాఫ్‌ సెంచరీలు బాదేశారు.


డివైన్‌ ఒంటరి పోరాటం


ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో ఆర్సీబీకి శుభారంభమే దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన (18), సోఫీ డివైన్‌ దంచికొట్టారు. తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒత్తిడికి గురై బాల్‌ను టైమింగ్‌ చేయలేకపోతున్న మంధానను 5.2వ బంతికి యాస్లే గార్డ్‌నర్‌ ఔట్‌ చేసింది. ఈ సిచ్యువేషన్లో ఎలిస్‌ పెర్రీతో కలిసి డివైన్‌ రెండో వికెట్‌కు 39 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం అందించింది. జోరు పెంచిన పెర్రీని జట్టు స్కోరు 97 వద్ద మానసి జోషీ పెవిలియన్‌ పంపించింది. దాంతో రన్‌రేట్‌ పెరిగింది. రిచా ఘోష్‌ (10) త్వరగానే ఔటైంది. ఈ క్రమంలో 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న డివైన్‌ భారీ షాట్లు ఆడబోయి 16.2వ బంతికి డగౌట్‌కు చేరింది. విజయ సమీకరణం 12 బంతుల్లో 33కు చేరుకోగా 19వ ఓవర్లో గార్డ్‌నర్‌ 9 పరుగులే ఇచ్చి వికెట్‌ పడగొట్టింది. హీథర్‌ నైట్‌ (30; 11 బంతుల్లో 5x4, 1x6) మెరుపులు మెరిపించినా మిగతా బ్యాటర్లు ఔటవ్వడంతో కథ ముగిసింది.




18 బంతుల్లో డంక్లీ 50


అప్పటికే ఉపయోగించిన పిచ్‌ కావడంతో గుజరాత్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచుల్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంది. ప్రతి ఓవర్లోనూ ఒకట్రెండు సిక్సర్లు బాదేలా, పది పరుగులు వచ్చేలా చూసుకుంది. జట్టు స్కోరు 22 వద్దే తెలుగమ్మాయి మేఘన (8) పెవిలియన్‌ చేరినా మరో ఓపెనర్‌ సోఫీ డంక్లీ సివంగిలా రెచ్చిపోయింది. మూడో ఓవర్‌ నుంచి కళ్లు చెదిరే సిక్సర్లు, చూడచక్కని బౌండరీలు బాదేసింది. కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ రికార్డు నెలకొల్పింది.


అదరగొట్టిన హర్లీన్‌


డంక్లీ దూకుడుతో పవర్‌ప్లే ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టానికి 64 పరుగులు చేసింది. ఇదే రేంజ్‌లో బాదేస్తున్న ఆమెను జట్టు స్కోరు 82 వద్ద శ్రేయాంక పాటిల్‌ ఔట్‌ చేసింది. ఆ తర్వాత హర్లీన్‌ డియోల్‌ క్రీజులో నిలిచింది. తొలుత యాష్లే గార్డ్‌నర్‌ (19)తో కలిసి 53 (36బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 13.5వ బంతికి గార్డ్‌నర్‌ను హీథర్‌నైట్‌ ఔట్‌ చేసింది. మరికాసేపటికే దయాలన్‌ హేమలత (16) పెవిలియన్‌ చేరింది. బౌండరీలు బాదేస్తున్న హర్లీన్‌ 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించింది. జట్టు స్కోరు 196 వద్ద ఆమెను శ్రేయాంక ఔట్‌ చేసినా గుజరాత్‌ 201/7కు చేరుకుంది.