RCB-W vs GG-W: 


విమెన్ ప్రీమియర్‌ లీగు ఆరో మ్యాచులో గుజరాత్‌ జెయింట్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్ గెలిచిన గుజరాత్‌ సారథి స్నేహ్‌ రాణా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌ కావడంతో మొదట బ్యాటింగ్‌కు మొగ్గు చూపుతున్నామని పేర్కొంది. నాయకత్వాన్ని తాను ఆస్వాదిస్తున్నానని వెల్లడించింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. తమకు బ్యాటింగ్‌ డెప్త్‌ ఉందని ధీమా వ్యక్తం చేసింది.


పిచ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మొదట బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఏదైనా ఫర్వాలేదని రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధాన తెలిపింది. అయితే మొదట బ్యాటింగ్‌ చేస్తే బాగుండేదని పేర్కొంది. ఒక బౌలింగ్‌ విభాగంగా తాము చర్చించుకున్నామని వెల్లడించింది. 'తొలి రెండు మ్యాచులు మేం అనుకున్న మేరకు రాణించలేదు. ఫైనల్‌ లేదా ఎలిమినేటర్‌కు ముందు ఎనిమిది మ్యాచులు ఉన్నాయి. ఆ ప్రకారం చూస్తే ఇది చాలా కీలక మ్యాచ్‌. దిశా ఆడటం లేదు. పూనమ్‌ జట్టులోకి వచ్చింది' అని మంధాన తెలిపింది.






తుది జట్లు


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, దిశా కసత్‌, ఎలిస్‌ పెర్రీ, హీథర్‌ నైట్‌, రిచా ఘోష్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్‌, మేఘన్‌ షూట్‌, రేణుకా సింగ్‌, ప్రీతి బోస్‌, పూనమ్‌ కెమ్నార్‌


గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డంక్లీ, మేఘన, హర్లీన్‌ డియోల్‌,  యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అనబెల్‌ సుథర్‌ల్యాండ్‌, స్నేహ్ రాణా, తనుజా కన్వార్‌, కిమ్‌ గార్త్‌, మాన్సీ జోషీ


పేపర్‌ పులులేనా?


పేపర్‌ మీద చూస్తే భీకరమైన జట్టు! మైదానంలోకి దిగితే ఒక్కరంటే ఒక్కరూ నిలవడం లేదు. ఏ ఇద్దరూ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పడం లేదు. పురుషుల జట్టులాగే తయారైందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును (Royal Challengers Bangalore) అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. దాంతో నేడు స్మృతి మంధాన (Smriti Mandhana) జట్టు కచ్చితంగా గెలిచితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ ఆర్సీబీ విఫలమవుతోంది. స్మృతి మంధాన, ఎలిస్‌ పెర్రీ, రిచా ఘోష్‌ భారీ ఇన్నింగ్సులు బాకీ పడ్డారు. బహుశా సోఫీ డివైన్‌ స్థానంలో నేడు డేన్‌వాన్‌ నీకెర్క్‌ రావొచ్చు. ఆమె స్పిన్‌తో పాటు బ్యాటుతో సిక్సర్లు బాదగలదు. ముంబయిపై 15 బంతుల్లో 23 పరుగులు చేసిన శ్రేయాంక పాటిల్‌ ఆశలు రేపుతోంది. మేఘన్‌ షూట్‌, రేణుకా సింగ్‌, హీథర్‌ నైట్‌ బౌలింగ్‌లో రాణించాల్సి ఉంది.


అన్‌ లక్కీ గుజరాత్‌!


గుజరాత్‌ జెయింట్స్‌ది (Gujaraj Giants) విచిత్రమైన పరిస్థితి. తొలి మ్యాచులోనే కెప్టెన్‌ బెత్‌ మూనీ గాయపడింది. నేటి మ్యాచుకైనా అందుబాటులో ఉంటుందో లేదో తెలీదు. ప్రతిభావంతులు ఉన్నా గెలుపు దక్కడం లేదు. డియాండ్రా డాటిన్‌ ప్లేస్‌లో వచ్చిన కిమ్‌ గార్త్‌ (Kim Garth) బౌలింగ్‌లో రెచ్చిపోతోంది. మిగతా బౌలర్లు పరుగులు నియంత్రించడం లేదు. వికెట్లూ తీయడం లేదు. హేమలతా దయాలన్‌ (Hemalata Dayalan) మిడిలార్డర్లో కీలకంగా మారింది. ఓపెనర్లు సోఫీ డంక్లీ, మేఘనా రెడ్డి శుభారంభాలు ఇవ్వాల్సి ఉంది. హర్లీన్‌ డియోల్‌ ఫర్వాలేదు. యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, సుథర్‌ల్యాండ్‌ బ్యాటింగ్‌లో మెరవాలి. ఇప్పటి వరకు ఈ జట్టులో హర్లీన్‌ మినహాయిస్తే ఒక్కరూ 30 స్కోరు చేయలేదు.  బౌలింగ్‌ బాగున్నా భాగస్వామ్యాలు విడగొట్టడం లేదు.