Wankhede Stadium Security Alert For India Vs New Zealand Semi Final Match: ప్రపంచకప్‌(world Cup 2023)లో తొలి సెమీస్‌(First Semi Final Match)లో భారత్‌(India )-న్యూజిలాండ్(New Zealand) మ్యాచ్‌ కోసం అభిమానులు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ... బెదిరింపులు రావడం కలకలం రేపింది. తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. టీమిండియా- న్యూజిలాండ్ మ్యాచ్‌ సందర్భంగా వాంఖడే స్టేడియం(Wankhede Stadium )లో విధ్వంసం జరుగుతుందని ముంబై పోలీసులకు హెచ్చరికలు వచ్చాయి. వాంఖడే స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తామని బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపుతో వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. వాంఖడే పరిసర ప్రాంతాలపై సాయుధ బలగాలను మోహరించారు.


 ఈ మ్యాచ్‌ను చూసేందుకు మాజీ దిగ్గజ క్రికెటర్లు తరలిరానున్నారు.  వీఐపీ గ్యాలరీలో టికెట్లన్నీఎప్పుడో  బుక్‌ అయిపోయాయి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సెమీస్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఇంగ్లండ్ మాజీ స్టార్‌ ఫుట్‌బాల‌్‌ ప్లేయర్‌ డేవిడ్ బెక్‌హ‌మ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ , సూపర్ స్టార్ రజనీ వంటి ప్రముఖులు వస్తున్నారన్న వార్తల నేపధ్యంలో  భద్రత కట్టుదిట్టం చేశారు. 


 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి సెమీఫైన‌ల్లో భార‌త్, కివీస్ హోరాహోరీగా త‌ల‌ప‌డ‌నున్నాయి. లీగ్ ద‌శ‌లో ఎదురైన ఓట‌మికి బ‌దులు తీర్చుకోవాల‌ని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే 2019 ఎడిష‌న్ సెమీస్‌లో ప‌రాభ‌వానికి ప్రతీకారంగా కివీస్‌ను ఇంటికి పంపాల‌ని రోహిత్ సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. ప్రస్తుతం అజేయంగా సెమీస్‌కు చేరిన టీమిండియా జోరు చూస్తేంటే కివీస్‌కు మ‌రోసారి భంగ‌పాటు త‌ప్పక‌పోవ‌చ్చని మాజీలు అంటున్నారు.


ఈ మహా సంగ్రామంలో తొలి సెమీస్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు జట్టు తుది కూర్పు, మిడిలార్డర్‌ వైఫల్యం వంటి సమస్యలతో కనిపించిన రోహిత్‌ సేన.. బరిలోకి దిగాక మాత్రం అంచనాలను మించి రాణిస్తోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. గత నెల ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రోహిత్‌సేన ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌ల ప్రస్థానం... నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ వరకు నిరాటంకంగా సాగింది. ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ముచ్చటగా మూడోసారి టీమిండియా కప్పును ముద్దాడుతుంది. 


ముంబైలోని వాంఖడే  పిచ్‌పై పరుగుల వరద ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖడే పిచ్‌..మ్యాచ్‌ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు దాదాపుగా బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది. 2019 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన న్యూడిలాండ్‌పై ఈ నాకౌట్‌ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఈ ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. అప్రతిహాత విజయాలతో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఓసారి ప్రతీకారం తీర్చుకుంది. కానీ అసలు సిసలు ప్రతీకారం తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది.