భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండగానే పాకిస్థాన్(Pakistani) వెనుదిరిగింది. అఫ్ఘానిస్థాన్ (Afghanistan) చేతిలో పరాజయం పాలై నాకౌట్ అవకాశాలను దూరం చేసుకున్న దాయాది దేశం... తర్వాత పుంజుకున్నా ఫలితం లేకుండా పోయింది. తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England)తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయంతో పాకిస్థాన్ స్వ దేశానికి అవమాన భారంతో పయనమైంది. పాక్ ప్రదర్శనపై మాజీలు, క్రికెట్ అభిమానులు సహా అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమమైన పేస్ దళంగా పేరొన్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు తేలిపోగా.. అత్యుత్తమ బ్యాటర్‌గా కొనియాడుతున్న కెప్టెన్ బాబర్ ఆజం కూడా పెద్దగా రాణించలేదు. పాక్ ఓటమికి ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు పాక్ బోర్డుపై విమర్శలు కూడా సంధిస్తున్నారు. అయితే పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ మాజక్(Abdul Razzaq) పాక్ బోర్డుపై విమర్శలు చేస్తూ శృతి తప్పాడు. బాలీవుడ్ నటి, కోట్లాది మంది అభిమానులకు రోల్ మోడల్ అయిన ఐశ్వర్యారాయ్(Aishwarya Rai)పై రజాక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్‌కు పక్కనే ఉన్న పాక్ మాజీ క్రికెటర్లు నవ్వడంపై నెటిజన్లు ఒక స్థాయిలో మండిపడుతున్నారు. పాక్ మాజీ క్రికెటర్లను ఏకిపారేస్తున్నారు. ఇదేనా మీ సాంప్రదాయమంటూ ఒక రేంజ్‌లో విమర్శలకు దిగుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ ప్రదర్శనపై ఓ టీవీ చర్చా వేదికలో అబ్దుల్ రజాక్, షాహీద్ అఫ్రిదీ, ఉమర్ గుల్,యూనిస్ ఖాన్, సయీద్ అజ్మల్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్ పాల్గొన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉద్దేశం సరిగా లేదని వ్యాఖ్యానిస్తూ అబ్దుల్ రజాక్.. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ పేరును మధ్యలోకి తీసుకొచ్చాడు. క్రికెట్‌ను బాగు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదన్న రజాక్ అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా వస్తాయని విమర్శించాడు. అంతటితో ఆగకుండా తాను ఐశ్వర్యారాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు కదా. ఇది కూడా అంతే అని... అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలకు షాహిద్ అఫ్రిదీ, ఉమర్‌గుల్. నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దీంతో భారత అభిమానులకు బాగా హర్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా పాక్ మాజీ క్రికెటర్లకు గట్టిగా ఇచ్చి పడేశారు.
అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఎదురైంది. ఇలా అనడానికి నీకు సిగ్గుండాలని ప్రారంభించిన నెటిజన్లు... అద్భుతమైన క్రికెటర్ అయి ఉండి ఇలాంటి థర్డ్‌క్లాస్ వ్యాఖ్యలు చేస్తావా అంటూ మండిపడుతున్నారు. షాహిద్ అఫ్రిది సిగ్గులేకుండా నవ్వడం మహిళలకు ఇచ్చే గౌరవమా అని నిలదీస్తున్నారు. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం వల్ల సోషల్ మీడియాలో పేరు వస్తుందని రజాక్ భావించి ఉంటాడని మరొకరు కామెంట్ చేశారు. నీ పరువు నువ్వే తీసుకున్నావు’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా..? రజాక్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం.. పక్కనే ఉన్న అఫ్రిదీ సహా ఇతర మాజీ ఆటగాళ్లు సిగ్గులేకుండా నవ్వడం పై ఇలా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.