World Cup 2023 NZ vs AFG Score 
చెన్నై: వన్డే ప్రపంచ కప్‌ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌ తో జరుగుతున్న మ్యాచ్ లో పటిష్ట న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసి అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ (54 రన్స్; 64 బంతుల్లో 4x4, 3x6) హాఫ్ సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (20) త్వరగా ఔటయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్‌ (71; 80 బంతుల్లో 4x4, 4x6), కెప్టెన్ టామ్ లాథమ్ (68; 74 బంతుల్లో 3x4, 2x6) హాఫ్ సెంచరీలతో రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసి అఫ్గాన్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది. అఫ్గాన్‌ బౌలర్లలో నవీనుల్ హక్ 2, ఒమర్‌జాయ్‌ 2, రషీద్‌ ఖాన్‌, ముజిబుర్‌ రెహ్మన్ చెరో వికెట్ తీశారు.


కివీస్‌ ఓపెనర్ల నుంచి జట్టుకు ఆశించిన శుభారంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ డేవాన్ కాన్వే.. అఫ్గాన్ స్పిన్నర్ ముజీబుర్‌ రెహ్మన్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో 30 పరుగులకే కివీస్ తొలివ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ విల్‌ యంగ్, రచిన్ రవీంద్ర నిలకడగా బ్యాటింగ్ చేయడంతో ఓ దశలో 20 ఓవర్లకు 109/1 తో పటిష్టంగా కనిపించింది. కానీ కేవలం ఒక్క పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అఫ్టాన్ పేసర్ అజ్మతుల్లా ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 2 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టాడు. రెండో బంతికి రచిన్ రవీంద్రను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో చివరి బంతికి విల్‌ యంగ్‌ క్యాచ్ ఔటయ్యాడు. మరుసటి ఓవర్లో రషీద్‌ బ్యాటర్ డారిల్ మిచెల్‌ ను పెవిలియన్ బాట పట్టించాడు. మిడ్‌ వికెట్‌ దిశగా ఆడిన బంతిని ఇబ్రహీం జద్రాన్‌ క్యాచ్ పట్టాడు.


మరో వికెట్ పడకుండా 4వ వికెట్ కు ఫిలిప్స్, కెప్టెన్ లాథమ్ 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 48వ ఓవర్లో నవీన్ ఉల్ హక్ షాకిచ్చాడు. క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి ఫిలిప్స్ ను, 3వ బంతికి కెప్టెన్ లాథమ్ ను పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మార్క్‌ చాప్‌మన్‌ (25 నాటౌట్; 12 బంతుల్లో 2x4, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో అఫ్గాన్ ముందు భారీ లక్ష్యం నిలిపింది కివీస్.  






విలియమ్సన్‌ లేకుండానే బరిలోకి కివీస్..

గాయం కారణంగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇదివరకే మెగా టోర్నీలో తొలి 2 మ్యాచ్ లకు దూరమైన విలిమయ్సన్ అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో మరోసారి గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ (107 బంతుల్లో 78 రన్స్) తరువాత చేతి బొటనవేలికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. మరోసారి గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగతున్న మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు.