India vs New Zealand: అప్రతిహాత విజయాలతో  సెమీస్‌లోకి దూసుకొచ్చిన టీమిండియా న్యూజిలాండ్‌తో కీలక సెమీస్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. గత ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్లో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బలాబలాలు చూస్తే భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో భారత్‌ చాలా బలంగా ఉంది. ఓపెనింగ్‌లో రోహిత్‌ శర్మ-శుభ్‌మన్‌గిల్‌, వన్‌ డౌన్‌లో విరాట్‌ కోహ్లీ, మిడిల్‌ ఆర్డర్‌లో అయ్యర్‌, రాహుల్‌, జడేజా.. లోయర్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఇలా భీకర బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కానీ ఇక్కడ గత చరిత్ర ముగ్గురు స్టార్‌ బ్యాటర్లను కలవరపెడుతోంది.  ఆ ముగ్గురు స్టార్‌ బ్యాటర్లే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కె.ఎల్‌. రాహుల్‌. వీళ్ల ముగ్గురు ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచుల్లో ఇప్పటివరకూ అద్భుతంగా రాణించి భారత్ జైత్రయాత్ర కొనసాగడంలో కీలక పాత్ర పోషించారు. కానీ నాకౌట్‌ మ్యాచ్‌లో వీరి గత గణాంకాలు కలవరపెడుతున్నాయి. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే వీరు గత చరిత్రను తిరగ రాయాల్సిందే. 


విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో  ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. మిడిల్ ఆర్డర్‌లో రాహుల్‌ను కూడా ఇదే ఫోబియా కలవరపెడుతోంది. ఈ ముగ్గురు భారత దిగ్గజాలు వాంఖడేలో కొత్త చరిత్రను లిఖించాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ నాలుగో ప్రపంచకప్ ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఆడిన ప్రతీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఆడాడు. 2011లో వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడాడు. దాయాదితో జరిగిన ఆ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి విరాట్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. 2019లో కూడా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. కోహ్లీకిది నాలుగో ప్రపంచకప్‌ సెమీస్‌. ఈ మ్యాచ్‌లో ఈ రన్‌మిషన్‌ ఏం చేస్తాడో చూడాలి.


రోహిత్‌ శర్మ 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో  34 పరుగులు చేసి అవుటయ్యాడు. 2019లో రోహిత్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. రాహుల్ ఇప్పటి వరకు ఒకే ఒక్క సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. సెమీఫైనల్ మ్యాచ్‌లో రాహుల్ కూడా ఒక్క పరుగే చేశాడు. ఈ ముగ్గురు దిగ్గజాల సెమీస్‌ గణాంకాలు కలవరపెడుతుండగా వీళ్లు  ఈ మ్యాచ్‌లో తప్పకుండా రాణిస్తారని అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. 


ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ 503 పరుగులు... గిల్‌ 270 పరుగులు చేశారు. మీరు మరోసారి విధ్వంసకర ఓపెనింగ్‌ ఇస్తే భారత్‌ గెలుపు ఖాయమవుతుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో 593 పరుగులు చేసి సచిన్‌ రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కె.ఎల్. రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది.టీమిండియా బౌలింగ్‌ విభాగం కూడా.... పటిష్టంగా ఉంది. బుమ్రా , సిరాజ్‌, షమీ అదరగొడుతున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కూడా సత్తా చాటుతున్నారు.