Team Indai Semi Final In ODI World Cup News: భారత పేస్‌ త్రయంపై ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌(Adam Gilchrist) ప్రశంసల వర్షం కురిపించాడు. మహ్మద్‌ సిరాజ్(Mohammed Siraj), మహ్మద్‌ షమీ(Mohammed Shami), జస్ప్రిత్‌ బుమ్రా(Jasprit Bumrah) బంతులు ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమని గిల్‌క్రిస్ట్‌ తేల్చేశాడు. భారత పేస్‌ త్రయాన్ని ఎదుర్కోవడం ఏ జుట్టకైనా సవాలే అని గిల్‌క్రిస్ట్‌ స్పష్టం చేశాడు. భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేసినా బౌలింగ్ చేసినా ఈ త్రయం అద్భుతాలు సృష్టిస్తూనే ఉందని గిల్‌ కొనియాడాడు. భారత్ నాకౌట్‌లోనూ ఇలాగే కొనసాగాలంటే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని గిల్‌ సూచించాడు. ఈ ప్రపంచకప్‌లో సిరాజ్, షమీ, బుమ్రా నిప్పులు చెరుగుతున్నారని గుర్తు చేశాడు. భారత బౌలింగ్ దాడిని లైట్ల కింద ఎదుర్కొనడం బాగా కష్టమని... వారి బౌలింగ్‌ లైట్ల కింద ఆడడం ప్రాణాంతకమని... సిరాజ్, షమీ, బుమ్రా బంతులను దాదాపుగా బ్యాటర్లు ఆడలేరని గిల్‌ అన్నాడు. పగటిపూట అయితే వీరి బంతులకు ఇబ్బంది పడ్డ బ్యాటర్లు ఎదుర్కొంటారని.. కానీ ప్లడ్‌లైట్ల కింద అది అసాధ్యమని గిల్‌ అంచనా వేశాడు. ఛేజింగ్‌లో కూడా టీమిండియా బలంగానే ఉందని, విరాట్ కోహ్లీ వంటి అత్యుత్తమ రన్ చేజర్‌ జట్టులో ఉన్నాడని గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ చాలా బలంగా ఉందని కూడా గిల్‌ గుర్తు చేశాడు. కానీ బౌలింగ్ సత్తా ప్రత్యర్థి జట్లకు మరింత ముప్పుగా మారుతుందన్నాడు. 


ఈ ప్రపంచకప్‌లో టీమిండియా సమతూకంతో ఉందని గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్, స్పిన్‌ కూడా బాగుందున్నాడు. జడేజా, కుల్దీప్ యాదవ్ వైవిధ్యంగా బౌలింగ్‌ చేస్తున్నారని... స్టార్‌ ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ను బెంచ్‌కు పరిమితం చేశారంటే టీమిండియా ఎంత బలంగా ఉందో అర్థమవుతుందని గిల్‌ అన్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికీ అజేయంగా ఉన్న జట్టు భారత్‌ ఒక్కటే అని గిల్‌క్రిస్ట్‌ గుర్తు చేశాడు.


బుమ్రా, షమీ, సిరాజ్‌తో కూడిన టీమిండియా పేస్‌ త్రయం.. అంచనాలను మించి రాణిస్తోంది. భారత పేస్ త్రయంతో సృష్టిస్తున్న సునామీలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు కొట్టుకుపోతున్నారు. బుల్లెట్లలా దూసుకుస్తున్న బంతులకు బ్యాటర్లు చిత్తు అవుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో పోరు మొదలు శ్రీలంకతో మ్యాచ్‌ వరకూ భారత పేసర్ల ప్రదర్శన నభూతో నభవిష్యతి అనే రీతిలో సాగింది. ఒకప్పుడు టీమిండియాలో మ్యాచ్‌ అంటే కనీసం ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగి ప్రత్యర్థిని చుట్టేసేవారు. ఇప్పుడు అదే బాధ్యతను భారత పేస్‌ త్రయం తీసుకుంది. భారత పిచ్‌లపై స్పిన్నర్లను తోసిరాజని భారత పేసర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో ప్రస్తుతం అత్యుత్తమ పేస్‌ త్రయం మనదే అనడంలో సందేహం లేదు. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌ కలిసి ప్రత్యర్థి పని పడుతున్నారు. 


టీమ్ ఇండియా తన 8 మ్యాచ్‌లలో మొత్తం ఎనిమిదిట్లోనూ గెలిచి 16 పాయింట్లు సాధించింది. ఇంకా ఒక మ్యాచ్ భారత్‌కు మిగిలే ఉంది. ఈ టోర్నమెంట్‌లో మరే ఇతర జట్టు 16 పాయింట్లను చేరుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని జట్లూ కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఓడిపోయాయి. అందువల్ల టీమ్ ఇండియా ఇప్పుడు లీగ్ దశను పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ముగించనుంది.