భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలన్న పాకిస్థాన్ ఆశలపై న్యూజిలాండ్ దాదాపుగా నీళ్లు పోసినట్లే కనిపిస్తోంది. శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో పాక్ సెమీస్ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. శ్రీలంకపై కివీస్ 160 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి పాకిస్థాన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఒకవేళ ఇప్పటికీ పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఆ అద్భుతం ఏంటంటే పాకిస్థాన్.. ఇంగ్లండ్ మధ్య శనివారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత పాక్ బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో భారీ విజయం సాధించాలి. అంటే పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 300 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌ను 13 పరుగులకే ఆలౌట్ చేయాలి. అలా కాకుండా పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే 284 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. అంటే ఇంగ్లండ్ 100 పరుగులకే ఆలౌటైనా... ఆ వంద పరుగులను పాకిస్థాన్ 16 బంతుల్లోనే సాధించాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవ్వరికీ సాధించని గణాంకాలతో పాక్ విజయం సాధించాలి. కానీ ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎంత బలహీనంగా ఉన్న అంత ఘోరంగా ఓడిపోతుందని ఊహించడం కష్టమే. అందుకే ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాకిస్థాన్ ఇప్పటివరకూ చేయని అద్భుతమే చేయాలి.
పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరాలన్న మార్గాలు మూసుకుపోవడంపై పాక్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మికీ ఆర్థర్ స్పందించాడు. ఇక అంతా దేవుడి చేతుల్లోనే ఉందంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో తాము సెమీస్‌కు చేరుకుంటామని ఆశిస్తున్నాననని అన్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ రోజు అసలు ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సెమీస్ చేరేందుకు తమ వంతు ప్రయత్నిస్తామని తర్వాత అంతా భగవంతుడి దయంటూ వ్యాఖ్యానించాడు. తమకు ఆ దేవుడి దయ కూడా కావలంటూ ఆర్థర్ కామెంట్స్ చేశాడు. ఓపెనర్ ఫకర్ జమాన్ రాకతో బ్యాటింగ్ మరింత బలోపేతమైందని ఇంగ్లండ్‌పై భారీ తేడాతో గెలుస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు.
అంతకుముందు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. కివీస్ విధించిన 402 పరుగుల లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఛేదించింది. ఫకర్ జమాన్ న్యూజిలాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ విధ్వంసం సృష్టించాడు. 63 బంతుల్లోనే ఫకర్ జమాన్ శతకం సాధించాడు. కేవలం 81 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్లతో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాబర్ ఆజమ్ కూడా 63 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సులతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యంతో పాక్ లక్ష్యం దిశగా నడిచింది. వర్షం వల్ల పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 341కి కుదించి ఆటను కొనసాగించారు. 25.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి పాకిస్థాన్ 200/1 స్కోరు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ 25.3 ఓవర్లకు 179 పరుగులు చేయాలి. పాకిస్థాన్ అప్పటికే 21 పరుగుల ముందంజలో ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు.
ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి పాక్ ఆశలను గల్లంతు చేసింది. పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లేలా..అఫ్గాన్‌కు సెమీస్ ద్వారాలు మూసుకుపోయేలా శ్రీలంకపై ఏకపక్ష విజయం సాధించింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు రాణించడంతో లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. అనంతరం డేవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డేరిల్ మిచెల్ రాణించడంతో 23.2 ఓవర్లలో అయిదు వికెట్లే కోల్పోయి కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. దాదాపు 160 బంతులు మిగిలి ఉండగానే కివీస్ విజయం సాధించడంతో దాదాపుగా పాక్, అఫ్గాన్ సెమీస్ అవకాశాలు ముగిసినట్లే కనిపిస్తోంది. ఇంగ్లండ్‌పై పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై అఫ్గాన్ భారీ విజయం సాధించి అద్భుతం సృష్టిస్తే తప్ప న్యూజిలాండ్ సెమీస్ చేరడం ఖాయమైనట్లే.