Teams qualified for Super 8 round from Group A, B, C, D: ప్రపంచకప్‌(T20  World Cup)లో పాకిస్థాన్‌(PAkistan) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌(ODI World Cup)లో దారుణ ప్రదర్శనతో లీగ్‌ దశలోనే వెనుదిరిగిన దాయాది జట్టు ఇప్పుడు టీ 20 ప్రపంచకప్‌లోనూ లీగ్‌ దశలోనే వైదొలిగేలా కనిపిస్తోంది. అమెరికా(USA), భారత్‌(India) చేతిలో ఓటములు పాక్‌ సూపర్‌ 8 ఆశలను దాదాపుగా సమాధి చేశాయి. ఇక పాక్‌ సూపర్‌ ఎయిట్‌కు చేరాలంటే అద్భుతమే జరగాలి. ఆ అద్భుతాన్ని చేసి పాక్‌ సూపర్‌ 8 చేరుకుంటుందా.. లేక వన్డే ప్రపంచకప్‌లో ఇంటిబాట పట్టినంటే టీ పొట్టి ప్రపంచకప్‌లోనూ లీగ్‌ దశలోనే ఇంటిదారి పట్టి అపఖ్యాతి మూటగట్టుకుంటుందా అన్నది చూడాలి. మరి పాక్‌ ఆ అద్భుతాన్ని సాకారం చేయాలంటే ఉన్న అవకాశాలను ఓసారి చూసేద్దాం.



పాక్‌ సూపర్‌ 8 చేరాలంటే...
 పాకిస్థాన్ క్రికెట్ జట్టు ICC T20 ప్రపంచ కప్ 2024 నుంచి నిష్క్రమణ అంచున ఉంది. అమెరికా చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలైన పాక్‌... ఇప్పుడు సూపర్‌ ఎయిట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయినా మిణుకుమిణుకుమంటున్న ఆశలు సజీవంగా ఉండాలంటే పాక్ ఇతర జట్లపై ఆధారపడాల్సి ఉంది. అమెరికాను భారత్‌ ఓడించడంతో పాకిస్థాన్‌ సూపర్‌ 8 ఆశలు సజీవంగా ఉంచాయి. ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8కి పాకిస్థాన్‌ అర్హత సాధించాలంటే జూన్ 16న జరిగే మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాలి. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఓడిపోతే పాకిస్థాన్ ఈ మెగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. జూన్ 14న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అమెరికా ఓడిపోతే.. పాకిస్థాన్ సూపర్‌ 8 ఆశలు మెరుగవుతాయి. కెనడాపై విజయం సాధించడం ద్వారా పాకిస్తాన్ నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకుంది. ఐర్లాండ్‌పై భారీ విజయం సాధిస్తే పాక్‌ నెట్‌ రన్‌రేట్‌ భారీగా పెరిగి సూపర్‌ ఎయిట్‌ ఆశలు పెరుగుతాయి. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో కెనడాపై భారత్‌ విజయం సాధించాలి. ఇలా జరిగితేనే పాక్‌ సూపర్‌8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఐర్లాండ్‌పై అమెరికా గెలిస్తే పాక్‌ అవకాశాలు దాదాపుగా మూసుకుపోతాయి. గ్రూప్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాక్‌ నెట్ రన్ రేట్ కెనడా కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 



మిగిలిన జట్ల పరిస్థితి ఇలా..
 టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఇప్పటికే టీమిండియా(India), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa) సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించాయి. ఇక మిగిలిన అయిదు జట్లు ఏవన్నదే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. మొత్తం నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. అమెరికా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కానీ పాకిస్థాన్‌తో పోలిస్తే అమెరికా నెట్‌ రన్ రేట్ తక్కువగా ఉంది. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న అమెరికా రెండు మ్యాచ్‌లు గెలిచింది. వారికి ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది. రెండు పరాజయాలు, ఒక విజయం తర్వాత పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో సూపర్‌ ఎయిట్‌కు చేరుకుంది. గ్రూప్ సీ నుంచి ఇప్పటివరకు ఏ జట్టు కూడా తదుపరి దశకు అర్హత సాధించలేదు. గ్రూప్ డీ నుంచి దక్షిణాఫ్రికా సూపర్ 8కి అర్హత సాధించింది.