ప్రపంచ ఛాంపియన్ గుకేష్ (Dommaraju Gukesh) చారిత్రక విజయం సాధించాడు. నార్వే చెస్ 2025 ఆరో రౌండ్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ టైమ్ కంట్రోల్ గేమ్‌లో తొలిసారిగా ఓడించాడు. గుకేష్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేని నార్వే స్టార్ ప్లేయర్ కార్ల్‌సన్ కోపంతో చెస్ బోర్డ్‌ను కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ దొమ్మరాజు మరో గొప్ప విజయం సాధించాడు. నార్వే చెస్ టోర్నీలో గుకేష్ చేతిలో ఓడిన తర్వాత మాజీ ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే చెస్ బోర్డ్‌ను కోపంగా కొట్టేశాడు. వెంటనే తన పొరపాటును గ్రహించిన కార్ల్‌సన్ వెంటనే అపాలీజ చెప్పి విజేత గుకేష్‌ను అభినందించాడు. గత ఏడాది ఇదే టోర్నీలో కార్ల్‌సన్‌ను మరో భారత టీనేజ్ సంచలనం ప్రజ్ఞానంద ఓడించగా.. తాజాగా గుకేష్ సైతం చాకచక్యంగా పావులు కదిపి విజయాన్ని అందుకున్నాడు.
గుకేష్ కూల్ సెలబ్రేషన్
చెస్ దిగ్గజం కార్ల్‌సన్ పై విజయం సాధించిన తర్వాత గుకేష్ ఎలాంటి భావోద్వేగానికి లోను కాలేదు. కార్ల్‌సన్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిన తరువాత నిశ్శబ్దంగా తన సీటు నుండి లేచాడు. విజయాన్ని నమ్మలేనట్లు కామ్ అండ్ కూల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు భారత చెస్ సంచలనం గుకేష్. ఇమాజీ నెంబర్-1 మాగ్నస్ కార్ల్‌సన్ గత కొన్నేళ్లు చెస్ ప్రపంచాన్ని ఏలాడని తెలిసిందే.
గుకేష్ డీ అద్భుతమైన తిరిగొచ్చాడు
19 ఏళ్ల గుకేష్ డీ మొదటి రౌండ్‌లో కార్ల్‌సన్‌తో జరిగిన గేమ్‌లో ఓడిపోయాడు. ఈ విజయం తర్వాత కార్ల్‌సన్ ఒక పోస్ట్ చేశాడు. 'రాజుతో ఆడేటప్పుడు తప్పులు చేయకూడదు' అని కార్ల్‌సన్ తన పోస్టులో రాసుకొచ్చాడు. అతన్ని ఓడించడం చాలా కష్టమని తెలుసుకోవాలని అంటూ అహంకారపూరితంగా ప్రవర్తించాడు కార్ల్‌సన్. ఆ కామెంట్‌కు ఏ మాత్రం స్పందించకుండా కేవలం తన ఆటతోనే గుకేష్ సమాధానం ఇచ్చాడు.
తెల్లని పావులతో ఆడిన గుకేష్ ఈ మ్యాచ్‌ను కొత్త విద్యార్థి పాఠాన్ని నేర్చుకున్నట్లుగా ఎంతో ఓర్పు, క్రమశిక్షణగా ఆడాడు. ఇంక్రిమెంట్ టైమ్ కంట్రోల్‌లో గేమ్ లోకి తిరిగి వచ్చాడు. తాజా గేమ్‌లో ఎక్కువ సమయం కార్ల్‌సనే ఆధిక్యతను కొనసాగించాడు. కానీ కార్ల్‌సన్ ఒక్క తప్పు చేయకపోతాడా అని ఎదురుచూసిన గుకేష్ సరైన టైంలో దెబ్బకొట్టాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచి కార్ల్‌సన్‌ను ఊహించని విధంగా ఓడించాడు. విజయం ఎవడి సొత్తు కాదని, ఎంత ఒదిగినా ఒదిగి ఉండాలని గుకేష్ తన ఆట, ప్రవర్తనతో నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు.
ఇదే టోర్నీలో అమెరికాకు చెందిన వరల్డ్ నంబర్ 2 హికరు నకమురను భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి ఓడిచాడు. మొత్తం 9.5 పాయింట్లతో ఇప్పటికీ కార్ల్‌సన్ టాప్‌లో కొనసాగుతున్నాడు.