అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆధునికత, సంప్రదాయాల మేళవింపుతో చరిత్రలో చెరగని ముద్రవేసేలా అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాదిగా రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) దంపతులకు కూడా ఆహ్వానం అందినా.. వ్యక్తిగత కారణాల వల్ల వారు హాజరుకాలేకపోయారు. విరాట్ కోహ్లీ హాజరు కాకపోవడంపై పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు.  అయితే, అయోధ్యలో అచ్చం కోహ్లీని పోలిన ఓ వ్యక్తి కనిపించాడు. జెర్సీలో ఉన్న అతడి చుట్టూ జనం గుమిగూడటమే కాక, సెల్ఫీలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాగే సచిన్ లా కనిపించే ఓ వ్యక్తి కూడా అయోధ్యలో సందడి చేశాడు. 


క్రీడా దిగ్గజాల భావోద్వేగం-


అయోధ్య వేదికగా అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం కోసం.. ఇప్పటికే ట్రస్టు సుమారు 7 వేల మందికిపై ఆహ్వానాలు పంపింది. అతిథుల రాకతో అయోధ్య పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడా ప్రముఖుల్లో ఆహ్వానాలు అందుకున్న వారు సైతం అయోధ్యకు తరలివచ్చారు. క్రికెటర్లు సచిన్‌(Sachin Tendulkar), అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మిథాలీరాజ్‌, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ తదితరులు ఈ అద్భుతమైన, అపురూపమైన కార్యక్రమానికిహాజరయ్యారు. క్రికెట్ గాడ్‌ సచిన్ టెండూల్కర్ సాంప్రదాయ దుస్తుల్లో ఈ మహా వేడుకకు హాజరవ్వగా... అభిమానులు సెల్ఫీల కోసం క్యూ కట్టారు.


ప్రపంచం దృష్టిని ఆక‌ర్షించిన మ‌హోత్సవంపై విదేశీ క్రికెట‌ర్లు స్పందించారు. రాముడి విగ్రహం ఫొటోను ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేసిన పాకిస్థాన్ మాజీ స్పిన్నర్‌ డానిష్ క‌నేరియా వందల ఏళ్ల నిరీక్షణకు తెర‌ప‌డిందని... వాగ్దానం ముగిసిందని... రాముడి ప్రాణ ప్రతిష్ఠ పూర్తయ్యిందని ట్వీట్‌ చేశాడు. ద‌క్షిణాఫ్రికా స్పిన్నర్ కేశ‌వ్ మ‌హ‌రాజ్  జై శ్రీ‌రామ్ అనే క్యాప్షన్‌తో రాముడిపై పోస్ట్ పెట్టాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్ కూడా ప్రాణ ప్రతిష్ఠ వేడుక శుభాకాంక్షలు తెలిపాడు.  ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్‌(Keshav Maharaj) సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుందని, దేశ వ్యాప్తంగానే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు.రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు . అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.