Mohammed Shami Ignites 2019 ODI World Cup Debate: భారత్ జట్టులో ప్రధాన పేసర్లలో మహ్మద్ షమీ(Mohammed Shami) ఒకడు. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ బౌలింగ్‌ను అంత తేలిగ్గా మర్చిపోలేం. అద్భుత బౌలింగ్‌తో వన్డే వరల్డ్ కప్‌లో షమీ అద్భుతమే చేశాడని చెప్పాలి. అయితే 2019 ప్రపంచ కప్ నాటి పరిస్థితులను షమీ ఓ సారి గుర్తు చేసుకున్నాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి పరిస్థితిని షమీ గుర్తు చేసుకున్నాడు. అయితే షమీ 2019 వన్డే ప్రపంచకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విస్మయానికి గురయ్యా
ఆ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో తుది జట్టులో తనకు చోటు దక్కకపోవడం తనను విస్మయానికి గురి చేసిందని చెప్పాడు. ఆ ప్రపంచకప్‌లో షమీ 5.48 ఎకానమీతో నాలుగు మ్యాచుల్లోనే 14 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌పైనా షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. అఫ్ఘాన్(Afg)తో జరిగిన మ్యాచ్‌లో షమీ హ్యాట్రిక్ కూడా తీసుకున్నాడు. అయినా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో షమీని జట్టులోకి తీసుకోలేదు. ఆ మ్యాచ్‌లో 240 పరుగుల ఛేదనలో విఫలమైన భారత్... 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనిపై షమీ తాజాగా స్పందించాడు. 2019 ప్రపంచకప్‌లో తాను మొదటి నాలుగు మ్యాచులు ఆడలేదని... కానీ ఆవకాశం దక్కిన తొలి మ్యాచ్‌లోనే రాణించానని గుర్తు చేసుకున్నాడు. అఫ్గాన్‌పై హ్యాట్రిక్ సాధించానని... తర్వాత ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్లు తీశానని.. ఆ తర్వాత మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లు తీశానని షమీ అన్నాడు. అయినా తనకు సెమీస్‌లో అవకాశం దక్కలేదని.. ఆ ఘటన తనను విస్మయానికి గురిచేసిందని యూట్యూబ్ షో ‘అన్‌ప్లగ్డ్’లో శుభంకర్ మిశ్రాతో షమీ వ్యాఖ్యానించాడు. తాను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఐసీసీ ట్రోఫీల్లో తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ మంచి ప్రదర్శనే చేశానని.. అయినా టీమ్ మేనేజ్‌మెంట్ తను నుంచి ఇంకా ఏం ఆశిస్తోందో తెలియలేదని అన్నాడు. అసలు నావద్ద దీనిపై ప్రశ్నలు, సమాధానాలు లేవని... తన దగ్గర ఉన్న ఒకే సమాధానం తనను తాను నిరూపించుకోవడం అని షమీ అన్నాడు. 2023 ప్రపంచకప్‌లోనూ దాదాపుగా ఇలాగే జరిగిందని.. ప్రారంభంలో కొన్ని మ్యాచుల్లో తనకు అవకాశం దక్కలేదని... కానీ అవకాశం దక్కగానే రాణించానని గుర్తు చేశాడు. 2019 ప్రపంచకప్‌లో షమీ నాలుగు మ్యాచ్‌లలో 14 వికెట్లు తీశాడు. 2023 ప్రపంచకప్‌లో షమీ 24 వికెట్లు తీశాడు.
షమీ ఒక్కడే
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మహ్మద్ షమీ అగ్రస్థానంలో ఉన్నాడు. షమీ వరల్డ్‌కప్‌లో 18 మ్యాచులు ఆడి 55 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్‌లో షమీ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లలో నాలుగుసార్లు ఐదు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ షమీనే. అయినా ఐసీసీ టోర్నమెంట్‌లలో షమీ పేరు ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. భారత్ గత మూడు ప్రపంచ కప్‌లలో 28 మ్యాచ్‌లు ఆడితే షమీ కేవలం 18 మ్యాచ్‌లలో మాత్రమే ఆడాడు. షమీ ఆడిన 18 మ్యాచుల్లో 15 భారత్ గెలిచింది.