Jasprit Bumrah: 


పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రాకు ఏమైందో చెప్పాలని టీమ్‌ఇండియా దిగ్గజం కపిల్‌దేవ్‌ డిమాండ్ చేశాడు. అతడి ఫిట్‌నెస్‌పై కనీసం అప్‌డేట్‌ ఇవ్వడం లేదని బీసీసీఐని విమర్శించాడు. ఐపీఎల్‌ వల్ల లాభంతో పాటు నష్టాలూ ఉన్నాయని పేర్కొన్నాడు. భారత్‌ ఆటగాళ్లు అనుభవజ్ఞులను సలహాలు అడగటం మర్చిపోయారని తెలిపాడు. వైఫల్యాల తర్వాత గావస్కర్‌ లాంటి వాళ్ల గైడెన్స్‌ తీసుకోవడం లేదని, అన్నీ తెలుసన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించాడు.


'జస్ప్రీత్‌ బుమ్రాకు అసలు ఏమైంది? అతడెంతో ఆశగా పనిచేయడం మొదలు పెట్టాడు. ఒకవేళ అతడు ప్రపంచకప్‌ సెమీస్‌, ఫైనల్‌కు అందుబాటులో లేకుంటే అతడిపై సమయం వృథా చేస్తున్నట్టే. రిషభ్ పంత్‌ చాలా గొప్ప క్రికెటర్‌. నిజంగా అతడు ఉండుంటే మన టెస్టు క్రికెట్‌ ఇంకెంతో పటిష్ఠంగా ఉండేది' అని కపిల్‌ దేవ్‌ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎల్‌కే  క్రికెటర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించాడు.


'దేవుడు కరుణామయుడు! నేనెప్పుడూ గాయపడలేదని చెప్పడం లేదు. ఇప్పుడు ఏడాదికి పది నెలలు క్రికెట్‌ ఆడుతున్నారు. కాస్త అనుమానం ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎల్‌ గొప్పదే. కానీ అది నాశనం చేయగలదు. ఆటగాళ్లు చిన్న చిన్న గాయాలైతే ఐపీఎల్‌ ఆడుతున్నారు కానీ టీమ్‌ఇండియాకు ఆడటం లేదు. వెంటనే విరామం తీసుకుంటున్నారు. నేనీ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నా' అని కపిల్‌ అన్నాడు.


ఆటగాళ్ల పనిభారం నిర్వహణలో బీసీసీఐ విఫలమవుతోందని కపిల్‌ దేవ్‌ అన్నాడు. 'కొద్దిపాటి గాయమైనప్పుడు చాలా కీలక మ్యాచ్‌ అయితేనే ఐపీఎల్‌ ఆడాలి. ఇలాంటి దశలో ఆటగాళ్లతో ఎంత క్రికెట్ ఆడించాలో క్రికెట్‌ బోర్డు అర్థం చేసుకోవాలి. ఈనాడు డబ్బు, వనరులు అన్నీ ఉన్నాయి. కానీ మూడు నుంచి ఐదేళ్లకు సంబంధించిన క్రికెట్‌ క్యాలెండర్‌ ఉండటం లేదు. క్రికెట్‌ బోర్డులో ఏదో తప్పు కనిపిస్తోంది' అని ఈ హరియాణా హరికేన్‌ వెల్లడించాడు.


Also Read: నేనేమీ కుందేలును కాదు! బౌలింగ్ చేయడంపై పాండ్య కామెంట్స్‌!


భారత క్రికెటర్లనూ కపిల్‌ దేవ్‌ వదల్లేదు 'టీమ్‌ఇండియా క్రికెటర్లు తమకే అన్నీ తెలుసని ఫీలవుతారు. ఎవరి సలహాలూ తీసుకోరు. ఒక్కసారిగా డబ్బులొస్తే ఇలాంటి అహంకారమే వస్తుంది. ఇప్పుడు క్రికెటర్లకు సీనియర్ల గైడెన్స్‌ అవసరం. లెజెండరీ సునీల్‌ గావస్కర్‌ నుంచి సలహాలు తీసుకోవడానికి ఇబ్బందేంటో అర్థమవ్వడం లేదు' అని ఆయన అన్నాడు. 'ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న సన్నీ వద్ద సలహాలు తీసుకుంటే తప్పేంటి? అడిగేంత వరకు ఆయన సూచనలు ఇవ్వరు. సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌ తర్వాత తనను ఎవరూ సలహాలు అడగడం లేదని వాపోయారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ ఓటమి తర్వాత ఒక్కరూ తన వద్దకు రాలేదని బాధపడ్డారు' అని కపిల్‌ పేర్కొన్నాడు.