Hardik Pandya:
మరిన్ని ఓవర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నానని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అంటున్నాడు. మెల్లమెల్లగా పనిభారం పెంచుకుంటున్నానని పేర్కొన్నాడు. ఇప్పటికే ఈ విషయం టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్టు వివరించాడు. తానిప్పుడు కుందేలును కాదని తాబేలునని వెల్లడించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో నిదానంగా అన్నీ సవ్యంగా ఉండేలా చూసుకుంటున్నానని తెలిపాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.
హార్దిక్ పాండ్య ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో పర్యటిస్తున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీసుకు (IND vs WI) సారథ్యం వహిస్తున్నాడు. కుర్రాళ్లను పరీక్షించాలన్న ఉద్దేశంతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని టీమ్ మేనేజ్‌మెంట్ రిజర్వు బెంచీపై కూర్చోబెట్టింది. దాంతో జట్టును పాండ్య నడిపిస్తున్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత అతడు రెండు నెలలు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఒక నెల పూర్తిగా ఇంట్లోనే గడిపాడు. మరో నెల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ పొందాడు. ఎక్కువ బౌలింగ్ చేయడానికి తాను సిద్ధమేనని వన్డే సిరీసుకు ముందు అతడు మేనేజ్‌మెంట్‌కు చెప్పాడు.
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌గా నిలిచింది. ఆ జట్టును నడిపించిన హార్దిక్ పాండ్య 16 మ్యాచుల్లో 25 ఓవర్లే వేశాడు. ఇప్పుడు వెస్టిండీస్‌తో రెండు వన్డేల్లో మొత్తం 9.4 ఓవర్లే విసిరాడు. తొలి వన్డేలో బౌలింగ్ ఆరంభించినప్పటికీ కేవలం మూడు ఓవర్లే వేయాల్సి వచ్చింది. ఇక రెండో వన్డేలో 6.4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయలేదు. బ్యాటింగ్‌లోనూ పెద్దగా రాణించలేదు. తొలి మ్యాచులో నాలుగో స్థానంలో వచ్చి 5 పరుగులు చేశాడు. ఇక రెండో దాంట్లో 14 బంతుల్లో 7 చేశాడు.
'నా దేహం బాగుంది. నేనిప్పుడు మరిన్ని ఓవర్లు వేయాలి. ప్రపంచకప్ కోసం పనిభారం పెంచుకోవాలి. ఇప్పటికైతే నేను తాబేలునే. కుందేలును కాదు. మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకొని అన్నీ సవ్యంగా సాగాలని కోరుకుంటున్నా' అని హార్దిక్ పాండ్య అన్నాడు. సిరీస్ సమం కావడం వల్ల ఆఖరి మ్యాచుపై ఉత్కంఠ పెరిగిందని అంటున్నాడు. 'నిజాయతీగా చెప్పాలంటే ఆఖరి మ్యాచ్ ముందు సిరీస్ 1-1తో సమమైతేనే బాగుంటుంది. అప్పుడే సవాళ్లు, ఒత్తిడి అలవాటు అవుతాయి. ఉత్కంఠ పెరుగుతుంది. అలాగే అభిమానులకూ మజా వస్తుంది' అని అతడు పేర్కొన్నాడు.
ఈ సిరీసులో తాము అంచనాల మేరకు బ్యాటింగ్ చేయడం లేదని హార్దిక్ పాండ్య అంగీకరించాడు. 'మేం అనుకున్నట్టుగా బ్యాటింగ్ చేయలేదు. మొదటి వన్డేతో పోలిస్తే రెండో వన్డే వికెట్ మెరుగ్గానే ఉంది. శుభ్‌మన్ గిల్‌ను మినహాయిస్తే అందరూ ఫీల్డర్ల వద్దకే బంతిని కొట్టి ఔటయ్యారు. అదే మమ్మల్ని నిరాశపరిచింది. ఏదేమైనా మేం నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది' అని పాండ్య వెల్లడించాడు.
ద్రవిడ్ కామెంట్స్: కుర్రాళ్లను పరీక్షించేందుకు వెస్టిండీస్ సిరీస్ మంచి అవకాశమని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటున్నాడు. గెలుపోటముల గురించి తమకు పట్టింపు లేదన్నాడు. అతి పెద్ద లక్ష్యం మీదే తాము దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్, ఆసియాకప్ ముందు విండీస్ సిరీసే ప్రయోగాలకు అనుకూలమని వెల్లడించాడు.