Rahul Dravid: 


కుర్రాళ్లను పరీక్షించేందుకు వెస్టిండీస్‌ సిరీస్‌ మంచి అవకాశమని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంటున్నాడు. గెలుపోటముల గురించి తమకు పట్టింపు లేదన్నాడు.  అతి పెద్ద లక్ష్యం మీదే తాము దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌, ఆసియాకప్‌ ముందు విండీస్‌ సిరీసే ప్రయోగాలకు అనుకూలమని వెల్లడించాడు.


వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీసులో టీమ్‌ఇండియా 1-1తో సమానంగా నిలిచింది. అయితే కెప్టెన్ రోహిత్‌, మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో వన్డేలు ఆడించడం లేదు. కుర్రాళ్లేమో నిరాశ పరుస్తున్నారు. రెండో వన్డేలో మరీ ఘోరంగా ఓటమి పాలయ్యారు.  దాంతో ఫ్యాన్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవెక్కడి నిర్ణయాలంటూ ఆందోళన చెందుతున్నారు. మూడో వన్డేలో హిట్‌మ్యాన్‌, కింగ్‌ కోహ్లీని ఆడించాలని పట్టబడుతున్నారు. సూర్య, సంజూ, గిల్‌ విఫలమవ్వడం అందరినీ నిరాశపరుస్తోంది. అయితే ద్రవిడ్‌ మాత్రం ఆసియాకప్‌ ముందు తమకు దొరికిన చివరి అవకాశం విండీస్‌ సిరీసేనని అంటున్నాడు.


'మనం బిగ్గర్‌ పిక్చర్‌ చూడాలి. మరికొన్ని రోజుల్లోనే ఆసియాకప్‌, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఉన్నాయి. గాయపడ్డ ఆటగాళ్లు ఎప్పటికి ఫిట్‌నెస్‌ సాధిస్తారో తెలియదు. ఇలాంటప్పుడు మనం అతిపెద్ద లక్ష్యం గురించి ఆలోచించాలి. ప్రతి సిరీసు, ప్రతి మ్యాచు గురించి ఆందోళన చెందకూడదు. అలా ఆలోచిస్తే మనం పొరపాటు చేస్తున్నట్టే లెక్క' అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు.


'నిజాయతీగా చెప్పాలంటే కుర్రాళ్లను పరీక్షించేందుకు మనకు దొరికిన చివరి అవకాశం ఇదే. గాయపడ్డ కొందరు ఆటగాళ్లు ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్నారు. ఆసియాకప్‌కు మరో నెలే ఉంది. మనకు అస్సలు టైమ్‌ లేదు. వారిలో కొందరు మెగా టోర్నీకి అందుబాటులోకి వస్తారని ఆశిస్తున్నా. ఆసియాకప్‌, ప్రపంచకప్‌లో ప్రయోగాలు చేయలేం కదా. అందుకే కుర్రాళ్లకు అవకాశం ఇస్తున్నాం' అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.


'ఇప్పుడు ప్రయోగాలు చేస్తేనే ఆటగాళ్లపై ఒక అంచనాకు రాగలుగుతాం. ఆసియాకప్‌కు ముందు రెండు మూడు మ్యాచులే ఉన్నాయి. అలాంటప్పుడు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ను ఆడిస్తే చాలా ప్రశ్నలకు జవాబులు దొరకవు. ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌లో ఉన్నవాళ్లు మెగా సిరీసులకు అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. అనిశ్చితిలో ఉన్నప్పుడు ఉన్నవాళ్లనే పరీక్షించడం మేలు' అని మిస్టర్‌ వాల్‌ స్పష్టం చేశాడు.


మిస్టర్‌ 360 డిగ్రీ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ విఫలమవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. ద్రవిడ్‌ మాత్రం అతడికి అండగా ఉంటున్నాడు. ' చూడండి, సూర్య ఓ అద్భుతమైన ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. టీ20 క్రికెట్లో అతడేం చేశాడో చూశాం. దేశవాళీ క్రికెట్లోనూ మెరిశాడు. అయితే వన్డే గణాంకాలు స్థాయికి తగ్గట్టు లేవని అతడు గుర్తించి తీరాలి. అతడు ఐపీఎల్‌ సహా చాలా టీ20 క్రికెట్ ఆడుతున్నాడు. వన్డేలకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. మేమైతే చాలా అవకాశాలు ఇస్తున్నాం. వాటిని ఒడిసి పట్టాల్సింది మాత్రం అతడే' అని ద్రవిడ్‌ తెలిపాడు. 


శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌పై ద్రవిడ్‌ ప్రశంసలు కురిపించాడు. ఈ సిరీసులో కిషన్‌ వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు కొట్టాడు. గిల్‌ మాత్రం ఆకట్టుకోలేదు. 'నేనైతే గిల్‌ గురించి ఆందోళన చెందడం లేదు. అతడు అందంగా బ్యాటింగ్‌ చేస్తాడు. కొన్నిసార్లు తక్కువ పరుగులే వస్తాయి. మనం ప్రతి మ్యాచుకు విమర్శించకూడదు. విండీస్‌లో బ్యాటింగ్‌ కండీషన్స్‌ సులభంగా లేవు. ఆటగాళ్లు మరింత శ్రమించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి గిల్‌ మూడు ఫార్మాట్లలో కీలకంగా ఉన్నాడు. మూడో మ్యాచులో బాగానే ఆడతాడని ఆశిస్తున్నా. కిషన్‌ బాగా ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిసి వరుసగా మూడో హాఫ్ సెంచరీ కొట్టాడు. అవకాశాలను ఒడిసి పడుతున్నాడు. ప్రయోగాలు చేయాలంటే విరాట్‌, రోహిత్‌ బెంచీపై కూర్చోక తప్పదు' అని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు.


Also Read: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!