Venkatesh Prasad On Indian Cricket Team: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. అయితే బార్బడోస్‌లో ఓటమి తర్వాత భారత జట్టు నిత్యం విమర్శలు ఎదుర్కొంటోంది. భారత క్రికెట్ జట్టు ఓటమిపై కపిల్ దేవ్‌తో సహా పలువురు భారత మాజీ ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు భారత్ ఓటమిపై మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తన ట్వీట్‌లో ‘టెస్ట్ క్రికెట్‌తో పాటు వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కూడా నిరాశపరిచాం. ఆశించిన ప్రదర్శన చేయడంలో టీమిండియా విఫలం అయింది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లను కోల్పోయాం. రెండు ప్రపంచ కప్‌ల్లో ఓటమి పాలయ్యాం. మనం ఆస్ట్రేలియా లాగా ఎక్సైటింగ్ టీం కాదు. అలాగే ఇంగ్లండ్‌లా బ్రూటల్ కూడా కాదు.’ అన్నారు.
డబ్బు, అధికారం ఉన్నప్పటికీ...
దీనికి కంటిన్యుయస్‌గా మరో ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్‌లో డబ్బు, అధికారం ఉన్నప్పటికీ మనం సాధారణ విషయాలను సెలబ్రేట్ చేసుకునే వ్యక్తులుగా మారాము అని తెలిపారు. ‘టీమిండియా ఛాంపియన్ టీమ్‌కి చాలా దూరంగా ఉంది. అన్ని జట్లు గెలవడానికి ఆడతాయి. అలాగే టీమిండియా కూడా. కానీ ప్రస్తుతం టీమిండియా పేలవ ప్రదర్శన వెనుక వారి అప్రోచ్, యాటిట్యూడ్ కూడా కారణం.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆరు వికెట్లతో ఘోర ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం వెస్టిండీస్ 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించాడు. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (55: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో షాయ్ హోప్ (63 నాటౌట్: 80 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేసీ కార్టీ (48 నాటౌట్: 65 బంతుల్లో, నాలుగు ఫోర్లు) తనకు చక్కటి సహకారం అందించారు.