How Indian Team Celebrated T20 Wc Win In Flight Dont Miss Rohit Sharma: విశ్వ విజేతలుగా నిలిచిన టీమిండియా(Team India) ఆటగాళ్లు,... భారత గడ్డపై కాలుమోపారు. అభిమానుల నీరాజనాల మధ్య... బీసీసీఐ(BCCI) అధికారుల స్వాగతాల మధ్య టీ 20 వరల్డ్‌కప్(T20 World Cup)తో టీమిండియా స్టార్లు స్వదేశంలో అడుగుపెట్టారు. బార్బడోస్ నుంచి బయల్దేరినప్పటి నుంచి ఢిల్లీ చేసరుకునే వరకు అంటే 16 గంటల విమాన ప్రయాణంలో నిద్రపోకుండా సంబరాలు చేసుకుంటూనే ఉన్నారు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా సందడి చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ 20 ప్రపంచక్‌పను పట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘనత సాధించిన ఆనందంలో ఆటగాళ్లు డ్యాన్సులతో అదరగొట్టారు.
విమానంలో సందడే సందడి
బార్బడోస్ నుంచి ఢిల్లీకి 16 గంటల విమాన ప్రయాణం. నిన్న బార్బడోస్ నుంచి బయల్దేరిన భారత ఆటగాళ్ల బృందం ఇవాళ తెల్లవారుజామున వరల్డ్ కప్ ట్రోఫీతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆడుగుపెట్టింది. బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎయిరిండియా విమానంలో విశ్వవిజేతలు రోహిత్, కోహ్లీ, బుమ్రా, ద్రవిడ్ ఏం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ విమాన ప్రయాణంలో ఆటగాళ్లు ఎలా ఎంజాయ్ చేసి ఉంటారనే ఆతృత చాలా మందిలో ఉంటుంది.
రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు, వారి కుటుంబ సభ్యులు, కోచింగ్, సహాయక సిబ్బంది, BCCI అధికారులు బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయారు. ప్రపంచ కప్ హీరోలు వరల్డ్‌కప్ ముగిసిన ఐదు రోజుల తర్వాత భారత్‌కు వచ్చారు. ఫ్లైట్ లోపల ఆటగాళ్ల భావోద్వేగాన్ని... సందడి చేసిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్... తమ భావోద్వేగాలను పంచుకున్నారు.
సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు విమానంలో ఎయిర్ ఇండియా పైలట్ ప్రత్యేక ప్రకటన చేశారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఘనత కొనియాడుతూ కూడా ప్రత్యేక ప్రకటన చేశారు. దేశ ఖ్యాతిని క్రీడా ప్రపంచంలో నిలబెట్టినందుకు భారత ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బందిని బిజినెస్ క్లాస్‌లో తీసుకొస్తున్నందుకు గర్వంగా ఉందని ఎయిరిండియా తెలిపింది. ఈ ప్రకటనతో ఆటగాళ్ల ఉత్సాహం రెట్టింపుల అయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ సందడి చేశారు.
అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టీ 20 ప్రపంచకప్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. సుదీర్ఘ విమాన ప్రయాణంలో తన కుమారుడు అంగద్‌ను ఒళ్లు కూర్చోబెట్టుకుని బుమ్రా ఆడుకుంటూ కనిపించాడు.
బస్సులో ఇలా...
భారత్‌లో దిగి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ డ్యాన్స్ చేస్తూ టీమ్ బస్సులో నుంచి అభిమానులకు ట్రోఫీని ప్రదర్శిస్తూ కనిపించాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లే క్రమంలో ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం లభించింది. టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇవాళ ప్రధాని మోదీని కలుస్తారు. ముంబైలో ఓపెన్ టాప్ బస్‌లో భారీ ప్రదర్శన నిర్వహిస్తారు. వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లకు బీసీసీఐ సన్మానం చేయనుంది. ముంబైలో, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు.