Shubman Gill Calls Abhishek Sharma For Zimbabwe Tour :  అభిషేక్‌ శర్మ(Abhishek Sharma).. ఈ తెలుగు కుర్రాడికి భారత జట్టులో చోటు దక్కుతుందని చాలా మంది అంచనా వేశారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) తరపున ట్రావిస్‌ హెడ్‌తో కలిసి మెరుపులు మెరిపించిన అభిషేక్‌... టీమిండియా టీ 20 జట్టులోకి రావడం ఎంతో దూరంలో లేదని అభిమానులతోపాటు మాజీలు అంచనా వేశారు. అయితే తొలిసారి టీమిండియా(India)కు ఎంపికైనప్పుడు అభిషేక్‌ శర్మ ఎలా ఫీలయ్యాడు... అతనికి ఫోన్‌ చేసి భారత జట్టుకు ఎంపికైనట్లు తెలిపింది ఎవరు... ఆ ఫోన్ వచ్చిన తర్వాత అభిషేక్‌ శర్మ ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యాడు... ఈ విషయాలపై అభిషేక్‌ శర్మే స్పందించాడు.


ఆ ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే...

జింబాబ్వే సిరీస్‌తో అంతర్జాతీయ వేదికపై తమదైన ముద్ర వేయాలని యువ ఆటగాళ్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. టీ 20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ప్రస్తుతం సంధి దశలో ఉంది. ఈ దశలో జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు సువర్ణావకాశం లభించింది. ఐపీఎల్‌ 2024లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగి టీ 20 సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో అభిషేక్‌ 204.22 స్ట్రైకర్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. తాను జింబాబ్వే టూర్‌కు ఎంపికైన తర్వాత భారత కెప్టెన్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్ వచ్చిందని అభిషేక్ శర్మ వెల్లడించాడు. ఇది తనకు చాలా పెద్ద విషయమని ఆ ఫోన్‌ తర్వాత తాను చాలా ఉద్వేగానికి లోనయ్యాయని అభిషేక్‌ తెలిపాడు. జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill ) తనకు కాల్ చేసి... టీమిండియాలో చోటు దక్కిందని చెప్పాడని వెల్లడించాడు. టీంలో తనకు స్థానం దక్కిన తర్వాత మొదటి ఫోన్‌ చేసింది గిల్‌ అని... ఆ తర్వాత తనకు చాలామంది కాల్స్‌ చేసి అభినందనలు తెలిపారని అభిషేక్‌ తెలిపాడు. తాను ఇంటికి వెళ్లే సరికి చాలామంది తన కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారని అభిషేక్‌ నవ్వుతూ చెప్పాడు. టీమిండియాకు సెలెక్ట్‌ కావాలన్న తన నెరవేరిందని చెప్తూ అభిషేక్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మొదటి కాల్ తనకు చాలా ప్రత్యేకమైనదని... తన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో ఇంతదూరం ఎంత కష్టపడితే వచ్చానో తనకు తెలుసని అభిషేక్ తెలిపాడు. 





 

పాస్‌పోర్ట్ మర్చిపోయా: పరాగ్‌

జింబాబ్వేతో జరగనున్న టీ 20 సిరీస్‌లో భారత్‌ జట్టులో ఎంపికైన క్షణాలను తలుచుకుని రియాన్ పరాగ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. దేశీయ టోర్నమెంట్లు, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత రియాన్‌ పరాగ్‌... తొలిసారి భారత క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాడు. భారత్‌కు ఆడాలనే కల నెరవేరిందని... తాను జట్టుకు ఎంపికయ్యానన్న సంతోషంలో పాస్‌పోర్ట్, ఫోన్‌ను మర్చిపోయానని పరాగ్‌ తెలిపాడు. తన చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలనేది తన కలని... ఆ కల నెరవేరిందని.. తాను జట్టుకు సెలెక్ట్‌ అయ్యానన్న ఫోన్‌ కాల్‌తో తనకు ఏమీ అర్థం కాలేదని పరాగ్‌ తెలిపాడు. పరాగ్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో భారత్‌-జింబాబ్వే అయిదు టీ 20లు ఆడనున్నాయి. జూలై 6న తొలి మ్యాచ్‌ జరగనుంది.