Melbourne Test Live Updates: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ఆసీస్ మరోసారి తమ అక్కసును ప్రదర్శించాయి. గురువారం నాలుగో టెస్టు తొలిరోజు ఆసీస్ ఓపెనర్ శామ్ కొన్ స్టాస్, కోహ్లీ మధ్య వాగ్యుద్ధంతోపాటు చిన్నపాటి తోపులాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ స్టాస్ ను ఉద్దేశపూర్వకంగా నెట్టాడని కోహ్లీపై ఐసీసీ కూడా చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ ను కూడా కేటాయించింది. అయితే దీనిపై ఆసీస్ మీడియా సంతృప్తి పడినట్లుగా లేదు. తమ పేపర్లలో కోహ్లీని గేలి చేస్తూ కథనాలు వండి వార్చింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాకు చెందిన ఒక పత్రికైతే క్లౌన్ కోహ్లీ అని కోహ్లీని అవమానపర్చింది. క్లౌన్ అంటే విదూషకుడని అర్థం. సాధారణంగా కోహ్లీని.. కింగ్ కోహ్లీగా వ్యవహరిస్తుంటారు. అయితే దానికి వ్యతిరేకంగా క్లౌన్ అని పిలిచి అవమానించింది.
అభిమానుల ఆగ్రహం..
మరోవైపు ఆసీస్ మీడియా చేసిన పనికి భారత అభిమానులు ఫుల్ గా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని ప్రకటిస్తూ, కామెంట్లు చేస్తున్నారు. యంగెస్ట్ ఓపెనర్ గా డెబ్యూ చేసి, మెరుపు అర్థ సెంచరీ చేసిన కొన్ స్టాస్ ఘనతను మెచ్చుకోవాల్సింది పోయి, కోహ్లీపై బురద జల్లుడేందని వ్యాఖ్యానిస్తున్నారు. తమ దేశ ఆటగాళ్ల కంటే కూడా కోహ్లీపైనే కథనాలు వండి వారిస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో న్యూస్ పేపర్లు అమ్ముడు పోతాయా..? అని చురకలు అంటించారు. మరోవైపు ఈ వివాదాన్ని కొన్ స్టాస్ తేలిగ్గా తీసుకున్నాడు. ఆటలో ఇవన్నీ సహజమేనని, భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని తేలికగా తీసుకున్నాడు.
లైట్ తీసుకున్న భారత బోర్డు..
మరోవైపు ఈ ఘటనను బీసీసీఐ కూడా తేలికగా తీసుకుంది. కొన్ స్టాస్-కోహ్లీ వివాదాన్ని తాను చూడలేదని, అయితే మ్యాచ్ లో ఇవన్నీ సహజమేనని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ వ్యాఖ్యానించాడు. ఏది ఏమైనా ఆట సజావుగా సాగడమే ముఖ్యమని, ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఇక నేథన్ మెక్ స్వీని స్థానంలో జట్టులోకి వచ్చిన కొన్ స్టాస్ అదరగొట్టాడు. వన్డే తరహాలో ఆడుతూ సూపర్ ఫిఫ్టీ చేశాడు. ముఖ్యంగా భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ను ఆటాడుకున్నాడు. టీ20 తరహాలో డిఫరెంట్ షాట్లు ఆడుతూ బౌండరీలు బాదాడు. అతని జోరుతో ఆసీస్ కు శుభారంభం దక్కింది. దీన్ని మిగతా బ్యాటర్లు అందిపుచ్చుకోవడంతో తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ భారీ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లతో రాణించాడు.