Virat Kohli T20I Retirement | టీమిండియా ఎట్టకేలకు 13 ఏళ్ల తరువాత ఓ ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా భారత్ నిలిచింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని స్పష్టం చేశాడు. అంతటితో ఆగకుండా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచే తన చివరి టీ20 మ్యాచ్ అని కోహ్లీ వెల్లడించాడు. దాంతో టీ20 ఫార్మాట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించినట్లయింది. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పాడు.


నా కల నెరవేరింది.. ఇక చాలనుకున్నాను..
ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఫైనల్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘మేం అనుకున్నది సాధించాం. మా కల నెరవేరింది. టీమిండియాకు ఆడేందుకు నాకు గొప్ప అవకాశం వచ్చింది. ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకున్నాను. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావించా. పరుగులు ఇక చేయడం సాధ్యం కావడం లేదనుకుంటే, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మాలో ఎంతో మంది ఈ కప్ నెగ్గాలని కలలు కన్నాం. నేటికి ఆ కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. యువ ఆటగాళ్లకు ఛాన్స్ రావాలి, వారికి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో భారత్ మరిన్ని మెగా ట్రోఫీలు సాధిస్తుందని’ ధీమా వ్యక్తం చేశాడు.






‘రోహిత్ శర్మ 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ నెగ్గాడు. రోహిత్ మొత్తం 9 టీ20 వరల్డ్ కప్‌లు ఆడగా, నేను 6 పొట్టి ప్రపంచ కప్‌లు ఆడాను. అతడికి ఈ కప్పు చాలా ముఖ్యమైనది. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి నేను అంత కాన్ఫిడెంట్‌గా లేను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సంతోష సమయంలో భావోద్వేగాలను అణచిపెట్టలేం. ఈ విజయాన్ని ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నారని’ కోహ్లీ పేర్కొన్నాడు.


ఈ టీ20 వరల్డ్ కప్ లో పూర్తిగా విఫలమైన విరాట్ కోహ్లీ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కోహ్లీ ఫామ్ పై, వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కోహ్లీ లాంటి క్లాస్ ప్లేయర్ కు ఫామ్ అనేది అవసరం లేదన్నాడు. సుదీర్ఘ కెరీర్ ఉన్న కోహ్లీ ఒక్క మ్యాచ్ తో లెక్కలు సరిచేస్తాడని, రోహిత్ చెప్పినట్లే ఫైనల్లో జట్టును ఆదుకుని అక్షర్ పటేల్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 125 టీ20లు ఆడిన కోహ్లీ ఒక్క సెంచరీ, 38 హాఫ్ సెంచరీల సాయంతో 4,188 రన్స్ సాధించాడు.