South Africa Chase 177 Target: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) తుది సమరంలో టీమిండియా(India)... సౌతాఫ్రికా(SA) ముందు సవాల్‌ విసిరే లక్ష్యాన్ని ఉంచింది. ఈ మెగా టోర్నీలో తొలిసారి విరాట్‌ కోహ్లీ(Kohli)కీలక ఇన్నింగ్స్ ఆడడం.. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(Akshar Patel) మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో భారత జట్టు... దక్షిణాఫ్రికా ముందు మంచి స్కోరు ఉంచింది. ఈ మ్యాచ్‌లో కీలకమైన టాస్‌ గెలిచిన రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకోగా... రెండో ఓవర్‌లోనే కేశవ్‌ మహరాజ్‌ చావు దెబ్బ కొట్టాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడ్డట్లు అనిపించింది. అయితే కోహ్లీ-అక్షర్‌ పటేల్‌ భారత జట్టుకు ఆపద్భాందవుల్లా మారి టీమిండియాకు భారీ స్కోరు అందించేందుకు బాటలు వేశారు. కోహ్లీ 59 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సులతో 76 పరుగులు చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక భారత జట్టు విశ్వ విజేతలుగా నిలవాలంటే భారమంతా బౌలర్లపైనే ఉంది. బుమ్రా సారధ్యంలోని టీమిండియా బౌలింగ్ దళం సత్తా చాటితే టీమిండియా జగజ్జేతలుగా నిలవడం ఖాయమైనట్లే.


 

కుప్పకూలిన టాపార్డర్

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వేళ హిట్‌మ్యాన్‌ నిర్ణయం సరైందేనని అనిపించింది. అనుకున్నట్లే కింగ్‌ విరాట్‌ కోహ్లీ తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు కొట్టి భారత్‌కు శుభారంభం అందించాడు. అనంతరం కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ రెండు ఫోర్లు కొట్టి పరుగుల జోరు పెంచాడు. అయితే ఆ తర్వాతి బంతికే రోహిత్‌ శర్మను అవుట్‌ చేసిన కేశవ్‌ మహరాజ్‌ టీమిండియాను తొలి దెబ్బ కొట్టాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో స్వీప్‌ ఆడిన రోహిత్‌... క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం రిషబ్‌ పంత్‌ అదే ఓవర్లో  అవుట్‌ కావడం టీమిండియాను గట్టి దెబ్బ కొట్టింది. పంత్‌ కూడా కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో స్వీప్‌ ఆడి కీపర్ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం కాసేపటికే టీ 20 నెంబర్‌ వన్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా అవుట్ కావడంతో టీమిండియా ఆత్మ రక్షణలో పడింది. నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసిన సూర్యను రబాడ అవుట్ చేశాడు. దీంతో 34 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. 23 పరుగులకు ఒక్క వికెట్‌ కూడా కోల్పోని భారత జట్టు 34 పరుగులు వచ్చేసరికి మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

 

ఆ భాగస్వామ్యమే నిలిపింది

34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను కోహ్లీ- అక్షర్‌ పటేల్‌ ఆదుకున్నారు. కోహ్లీ ఆచితూచి అడగా... అక్షర్‌ పటేల్‌ మాత్రం మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఉన్నంతసేపు చాలా ధాటిగా అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ చేశాడు.  31 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సులతో 47 పరుగులు చేసిన అక్షర్‌ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్షర్‌ పటేల్ దానికి తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీతో కలిసిన శివమ్ దూబే కాస్త దూకుడుగా ఆడేందుకు యత్నించాడు. విరాట్‌ కోహ్లీ 48 బంతుల్లో నాలుగు ఫోర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తం 59 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ఆరు ఫోర్లు, రెండు సిక్సులతో 76  పరుగులు చేశాడు. శివమ్‌ దూబే 16 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 27 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ 2, నోర్జే రెండు వికెట్లు తీశారు.  టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.