Virat Kohli injured ahead of Pink Ball Test? బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ( Border-Gavaskar Trophy)లో తొలి టెస్టు గెలిచి టీమిండియా(Team India) మంచి ఫామ్ లో ఉంది. డిసెంబర్ ఆరు నుంచి జరిగే రెండో టెస్టుకు కూడా సిద్ధమవుతోంది. ఈ టెస్టులోనూ గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ దిశగా మరో అడుగు ముందుకేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. అయితే తొలి టెస్టులో అద్భుత శతకంతో ఫామ్ లోకి వచ్చిన.. కింగ్ కోహ్లీ(Virat Kohli) మోకాలికి గాయమైందన్న వార్తలతో.. టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. రెండో టెస్టు జరగనున్న ఆడిలైడ్ కు చేరుకున్న భారత జట్టు పూర్తి ప్రాక్టీస్ లో మునిగిపోయింది. రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలికి కట్టు కట్టుకుని ప్రాక్టీస్ చేయడంతో భారత క్రికెట్ జట్టు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ మోకాలి నొప్పితో తీవ్రంగా బాధపడినట్లు తెలుస్తోంది. మోకాలి నొప్పి నుంచి తేరుకునేందుకు విరాట్.. వైద్యుల సహాయం కూడా తీసుకోవడం కనిపించింది. దీంతో కోహ్లీకి గాయమైందని.. అతడు రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం కష్టమేనన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ(BCCI) నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 






ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో సిరీస్‌ను అద్భుతంగా ప్రారంభించాడు.జూలై 2023 తర్వాత  కోహ్లీ టెస్ట్ సెంచరీ చేశాడు. "మొదటి ఇన్నింగ్స్‌లో, కోహ్లీ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంపై దృష్టి సారించాడు. తన సహజ శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో, అతను తన లయను అందుకున్నాడు. సెంచరీ చేశాడు. కోహ్లీ ఫామ్ కొనసాగితే ఆస్ట్రేలియాకు కష్టాలు తప్పవు" అని పాంటింగ్ వెల్లడించాడు. 


కోహ్లీ మరొక్క సెంచరీ చేస్తే ప్రపంచ రికార్డు..!
బీజీటీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 6 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు ముందు కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచేందుకు అతడికి అవకాశం వచ్చింది. బీజీటీలో అత్యధిక సెంచరీలు(9) చేసిన ప్లేయర్‌గా టెండూల్కర్‌ ఉన్నాడు. కోహ్లీ కూడా 9 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే బీజీటీలో అత్యధిక శతకాలు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలుస్తాడు.


ఆస్ట్రేలియా జట్టులో లుకలుకలు


పెర్త్ టెస్టులో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా(Australia) క్రికెట్ జట్టులో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. మ్యాచులో ఓటమికి బ్యాటర్లే కారణమనే భావన బౌలర్లలో ఉందని వినిపిస్తోంది. బ్యాటర్లు, బౌలర్ల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి టెస్టు మూడో రోజు ఆట తర్వాత ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్‌వుడ్.. బ్యాటర్ల తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటర్ల వైఫల్యంతోనే ఓడిపోయామని వారు భావిస్తున్నారట.