Virat Kohli, Rohit Sharma Emotional: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022ను టీమ్‌ఇండియా విజయంతో మొదలుపెట్టింది. చిరకాల ప్రత్యర్థి, దాయాది పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. మెల్‌బోర్న్ వేదికగా సాగిన పోరులో ఆఖరి బంతికి గెలుపు తలుపు తట్టింది. అసలు గెలుపుపై ఆశల్లేని స్థితిలో విరాట్ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్య (40; 37 బంతుల్లో 1x4, 2x6)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ముగింపు వరకు టీమ్‌ఇండియా క్రికెటర్లు, అభిమానులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. జయహే.. జయహే అంటున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. భారత్ 2007లో తొలి టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు హిట్‌మ్యాన్ కుర్రాడు. అప్పట్నుంచి చాలా ప్రపంచకప్‌లు ఆడాడు. ఈ సారి కెప్టెన్సీ చేస్తున్నాడు. అతడి వయసు ఇప్పుడు 35. మహా అయితే రెండేళ్లు ఆడగలడు. అందుకే తన నాయకత్వంలో ప్రపంచకప్ గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య నాయకత్వ విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఇద్దరి అభిమానులు పరస్పరం వాదోపవాదాలకు దిగుతుంటారు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్ మధ్య బ్రొమాన్స్ చూస్తే అలా అనిపించదు. విజయం అందించిన వెంటనే హిట్‌మ్యాన్ పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చాడు. విరాట్‌ను ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. బిగ్గరగా హత్తుకున్నాడు. ఈ సీన్ చూస్తున్న కోట్లాది మంది థ్రిల్ అయ్యారు.
సాధారణంగా మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడుగా ఉంటాడు. యానిమేటెడ్‌గా కనిపిస్తాడు. వికెట్లు పడ్డా, క్యాచులు అందుకున్నా తనదైన రీతిలో స్పందిస్తాడు. అతడు చాన్నాళ్ల తర్వాత మైదానంలో భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచును గెలిపించాక విచిత్రంగా అతడి కంట్లో నీటితడి కనిపించింది. గతానికి భిన్నంగా అతడు ఎమోషనల్ అయ్యాడు. తానాడిన అత్యుత్తమ ఇన్నింగ్సుల్లో ఇదొకటని తెలిపాడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదని రవిశాస్త్రితో అన్నాడు. మాజీ క్రికెటర్లు సునిల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్, చంద్రశేఖరన్ సైతం విజయాన్ని ఆస్వాదించారు. సన్నీ అయితే ఎగిరి గంతులేశాడు.