Viral Video: ఐపీఎల్ - 16 లో  భాగంగా ఇటీవలే ముగిసిన  ఫైనల్స్‌లో  చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి తమ ఖాతాలో ఐదో ట్రోఫీని  సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.   వర్షం కారణంగా సుమారు మూడు రోజుల పాటు సాగిన ఈ ఉత్కంఠ ఫైనల్‌ గెలిచిన తర్వాత  సీఎస్‌కే ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలు చేసుకున్నాయి.  చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని కూడా  భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి  సంబురాలు చేసుకున్నాడు. 


అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని   స్టేడియంలో చెన్నై ఆటగాళ్లందరితో కలిసి  ఐపీఎల్ - 16 ట్రోఫీ నిలిపిఉంచిన  చోటుకు వెళ్లి దానిని పరిశీలనగా చూస్తుండగా ఓ  ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.   కూతురుతో కలిసి అక్కడే ఉన్న సాక్షి.. ధోనిని తనవద్దకు రావాలని, హగ్ ఇవ్వాలని  రెండు చేతులు చాచి కోరింది.  


 






సాక్షి అభ్యర్థనకు ముందు ధోని ఒప్పుకోలేదు. ‘ట్రోఫీని చూడనివ్వు’ అన్నట్టుగా సైగ చేశాడు. కానీ సాక్షి మాత్రం పట్టు విడవకుండా.. ‘తొక్కలో ట్రోఫీ.. దానిని వదిలేయ్.. నేను హగ్  ఇస్తానంటే రావేంటి..?’అన్నట్టు సైగలు చేసింది. దీంతో ధోని మెల్లిగా  సాక్షి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి ఆమెతో పాటు కూతురు జీవాను కూడా మనస్ఫూర్తిగా హగ్ చేసుకున్నాడు. తల్లీకూతుళ్లు కూడా ధోనిని మనసారా హత్తుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  


 






ధోని - సాక్షిలతో పాటు  చెన్నై టీమ్‌లో ఉన్న రవీంద్ర జడేజా,  శివమ్ దూబే, అజింక్యా రహానే లు కూడా తమ  భార్యలతో కలిసి ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చారు.   రుతురాజ్ గైక్వాడ్ కూడా తన కాబోయే భార్య  ఉత్కర్ష పవార్ తో కలిసి  ఫోటోలు దిగాడు.  వ్యక్తిగతంగానే గాక చాలా మంది ఆటగాళ్లు  ధోనితో కలిసి ఫోటోలు దిగారు.


కాగా ఐపీఎల్ -16 ముగిసిన వెంటనే ధోని తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.   గురువారం  ముంబైకి చేరుకున్న ధోని..  కోకిలాబెన్ ఆస్పత్రిలో బీసీసీఐ మెడికల్ ప్యానెల్ మెంబర్  దిన్షా పర్దీవాలా నేతృత్వంలో ధోనికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్  స్పందిస్తూ.. ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడని.. మరో రెండ్రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్తాడని చెప్పారు.  ఇక ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ లో ఆడతాడా..? లేదా..? అన్నది నిర్ణయించుకోవడానికి చాలా టైమ్ ఉందని.. ఆలోపు అతడు   నిర్ణయం తీసుకుంటాడని  వెల్లడించారు.   సర్జరీ నుంచి  పూర్తిగా కోలుకుని  ఫిట్ అవడానికి ధోనికి  2 నెలల సమయం పట్టనుందని తెలుస్తున్నది. ఆ తర్వాత  శరీరాన్ని సహకరించేదానిపై   ధోని తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని సమాచారం.