Major League Cricket: ‘ఇందుగలవాడందులేడని సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందు గలను’ అన్నట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ప్రతి క్రికెట్ లోనూ భాగమవుతున్నాయి. ఒక్క భారత్‌కే పరిమితం కాకుండా పలు దేశాల్లోని క్రికెట్ లీగ్ లలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఐపీఎల్ పుణ్యాన విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఫ్రాంచైజీలలో పలు టీమ్‌లు ఇప్పటికే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, యూఏఈలలో జట్లను కొనుగోలు చేయగా ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో కూడా ప్రత్యక్షం కాబోతున్నాయి. యూఎస్ఎ వేదికగా ఈ ఏడాది జులై నుంచి జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ)లో నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు టీమ్స్ ను దక్కించుకున్నాయి.
ఎంఎల్‌సీ వెల్లడించిన ఓ ప్రకటన మేరకు.. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా టీమ్ లను సొంతం చేసుకున్నాయి. భారత్‌లో మాదిరిగానే అమెరికాలోని ప్రధాన నగరాల పేర్లతో ఫ్రాంచైజీల పేర్లు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఏ ఫ్రాంచైజీ ఎవరికి..?
క్రిక్ ఇన్ఫోలో వచ్చిన నివేదిక ప్రకారం.. ఐపీఎల్‌లో ఐదు సార్లు ట్రోఫీ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు న్యూయార్క్ ను దక్కించుకుంది. నాలుగు సార్లు ఐపీఎల్ విజేత చెన్నై.. టెక్సాస్‌ను, రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ విన్నర్ కోల్కతా.. లాస్ ఏంజెల్స్ ఫ్రాంచైజీలను సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. సియాటెల్ ఫ్రాంచైజీని కొనుగులో చేసింది. అయితే సియాటెల్ ను ఢిల్లీతో పాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా కో ఓనర్ (సహ యజమాని) గా ఉన్నాడు.
మొత్తం ఆరు టీమ్ లు ఉన్న ఎంఎల్‌సీలో నాలుగింటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోగా మిగిలిన రెండింటినీ భారత సంతతి వ్యక్తులే దక్కించుకోవడం విశేషం. వాషింగ్టన్ డీసీ ఫ్రాంచైజీని వాషింగ్టన్ డీసీని స్థానిక పెట్టుబడిదారుడు సంజయ్ గోవిల్ కొనుగోలు చేశాడు. ఇక శాన్‌ఫ్రాన్సిస్కో టీమ్ ను ఆనంద్ రాజరామన్, వెంకీ హరినారాయణ్ లు దక్కించుకున్నారు. లీగ్ లో ఉన్న ఆరు జట్లకు గాను ఆరింటినీ భారతీయులే దక్కించుకోవడం విశేషం.
జులై నుంచి..
ఆరు టీమ్స్ తో జరుగబోయే ఈ లీగ్.. 2023 జులై 13 నుంచి 30 వరకూ సాగనుంది. డల్లాస్, టెక్సాస్ వేదికగా మ్యాచ్ లు జరిగే అవకాశముంది. స్థానిక అమెరికా క్రికెటర్లతో పాటు మిగిలిన ఆటగాళ్లకు మార్చి 19న వేలం నిర్వహించనున్నారు.
కాగా ఎంఎల్‌సీలో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసిన ముంబైకి ఐపీఎల్ తో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్, యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లలో టీమ్ లు ఉన్నాయి. చెన్నైకి కూడా సౌతాఫ్రికాలో టీమ్ (జోబర్గ్ సూపర్ కింగ్స్) ఉంది. ముంబైకి కూడా ఢిల్లీ మాదిరే సౌతాఫ్రికా, యూఏఈలో టీమ్స్ ఉన్నాయి. కేకేఆర్ కు కూడా వెస్టిండీస్ లోని కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో పెట్టుబడులు పెట్టింది. ఇక తాజాగా ఈ జట్లు యూఏఈలో కూడా మెరవబోతున్నాయి.