IND vs AUS 1st ODI:
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమ్‌ఇండియా టాస్ గెలిచింది. ఈ మ్యాచులో భారత్‌కు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్య టాస్ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నలుగురు పేసర్లను ఎంచుకున్నామని తెలిపాడు. ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నామని పేర్కొన్నాడు.
'మేం మొదట బౌలింగ్ చేస్తాం. వాంఖడే పిచ్ బాగుంది. మంచు ప్రభావం ఉంటుంది. రెండో ఇన్నింగ్సులో ఛేదన సులభంగా ఉంటుంది. కొన్నాళ్లు విరామం తీసుకున్నాను. విశ్రాంతి తీసుకున్నప్పుడు మరింత పునరుత్తేజం పొందుతాను. టీమ్‌ఇండియాకు ప్రతి మ్యాచు, ప్రతి ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించడం ముఖ్యం. ఈ ఏడాది ప్రపంచకప్ జరుగుతుంది కాబట్టి వన్డే ఫార్మాట్ కీలకం. శార్దూల్, షమి, సిరాజ్, నేను పేస్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటాం. జడేజా, కుల్‌దీప్ స్పిన్ వేస్తారు' అని హార్దిక్ పాండ్య అన్నాడు.
'టాస్ ఓడినా ఫర్వాలేదు. ఏం ఎంచుకోవాలో తెలియదు కాబట్టి మొదట బ్యాటింగ్ చేయడం సంతోషమే. ఈ పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును ఎంచుకుంటున్నాం. టెస్టు సిరీసు రెండో అర్ధభాగంలో మేం పుంజుకున్నాం. అలెక్స్ కేరీ అనారోగ్యంతో స్వదేశానికి వెళ్లాడు. జోస్ ఇంగ్లిస్‌ను తీసుకున్నాం. డేవిడ్ వార్నర్ ఇంకా ఫిట్ అవ్వలేదు. మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేస్తున్నాడు' అని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు.
తుది జట్లు
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
జట్టు కూర్పుపై దృష్టి..
గత కొన్నాళ్లుగా స్వదేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత్ దుర్బేధ్యంగా తయారైంది. భారత్ ను ఓడించి సిరీస్ ను గెలుచుకోవడమంటే అది అతిశయోక్తే. రోహిత్ సారథిగా అయ్యాక ఇది మరింత ఎక్కువైంది. ఈ ఏడాది కూడా జనవరిలో శ్రీలంక, న్యూజిలాండ్ లపై భారత్ వన్డే సిరీస్ లను గెలుచుకుంది. ఆసీస్ పైనా అదే ఫీట్ రిపీట్ చేయాలని భావిస్తున్నది. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్ సిరీస్ లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు.
గిల్ తన ఫామ్ ను కొనసాగించాలని భారత్ కోరుకుంటున్నది. తొలి వన్డేలో రోహిత్ గైర్హాజరీలో గిల్ కు తోడుగా ఇషాన్ కిషన్ రావొచ్చు. విరాట్ కూడా వన్డేలలో బాగానే ఆడుతున్నాడు. శ్రేయాస్ దూరమైన నేపథ్యంలో మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ చాలా కీలకం. అతడితో పాటు రాహుల్, పాండ్యా, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ లో కూడా సిరాజ్ వన్డేలలో ఇరగదీస్తున్నాడు. అతడికి తోడుగా షమీ, ఉమ్రాన్ లలో ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరం. స్పిన్నర్లలో కూడా చాహల్-కుల్దీప్ ల మధ్య పోటీ నెలకొని ఉంది.