ICC WTC Final: బోర్డర్ - గవాస్కర్ ట్రోపీలో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన అనంతరం  భారత జట్టు  వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.    జూన్ 7 నుంచి 11 వరకు  ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా భారత్ - ఆస్ట్రేలియాలు  టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో   ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్  కోసం వెతుకుతున్న  టీమిండియాకు హార్ధిక్ పాండ్యా షాకిచ్చాడు. తాను డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోనని స్పష్టం చేశాడు.  అందుకు తాను అర్హుడు కాదని తేల్చి చెప్పాడు. 


ఆస్ట్రేలియాతో వన్డే  సిరీస్ ప్రారంభానికి ముందు గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న పాండ్యాకు ఇదే ప్రశ్న ఎదురైంది.  అక్కడికి వచ్చిన పాత్రికేయులు ‘మీరు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతారా..?’అని అడగ్గా దానికి పాండ్యా స్పందిస్తూ.. ‘లేదు’అని కరాఖండీగా చెప్పేశాడు.


విలువలకు కట్టుబడే మనిషిని.. అది కరెక్ట్ కాదు.. : పాండ్యా 


తాను డబ్ల్యూటీసీ ఫైనల్ ఎందుకు ఆడడటనే దానికి గల కారణాలను వివరిస్తూ పాండ్యా.. ‘నేను నైతికంగా చాలా బలమైన వ్యక్తిని. విలువలకు కట్టుబడి ఉంటా. వాస్తవంగా చెప్పాలంటే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు గాను  మిగతా ఆటగాళ్లు చేసినదాంట్లో నేను 10 శాతం కూడా చేయలేదు.  అసలు ఒక్క శాతం కూడా కృషి చేయలేదు.  ఇప్పటికిప్పుడు  నేను వచ్చి మరొకరి స్థానాన్ని తీసుకోవడం కరెక్ట్ కాదు.  అది సమంజసం కాదు కూడా.. టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటే  అందుకు నన్ను నేను నిరూపించుకోవాలి.  మానసికంగా నన్ను నేను సిద్ధం  చేసుకున్నాకే  ఆడతా. అప్పటిదాకా టెస్టులు కూడా ఆడను..’అని  చెప్పుకొచ్చాడు. ఇప్పట్లో టెస్టులకు వచ్చే ఉద్దేశం తనకు లేదని హార్ధిక్ చెప్పకనే చెప్పాడు. 


మరో ఆప్షన్ కోసం వెతుకులాట.. 


హార్ధిక్ హ్యాండ్ ఇవ్వడంతో  టీమ్ మేనేజ్మెంట్ కు కొత్త తలనొప్పి మొదలైంది.  పదేండ్ల తర్వాత  ఐసీసీ ట్రోఫీని దక్కించుకునే అవకాశం రావడంతో  ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దని భారత్ భావిస్తోంది.  అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగేది ఇంగ్లాండ్ లో.. అక్కడి పిచ్ లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి.   ప్రస్తుతం భారత జట్టు స్టార్ పేసర్  బుమ్రాకు సర్జరీ కావడంతో  పాండ్యా వస్తే భారత్ కు ఉపయోగకరంగా ఉంటుందని.. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించే అతడు ఉంటే జట్టు సమతూకం కూడా బాగుటుందని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. కానీ హార్ధిక్ అందుకు తిరస్కరించడంతో మరో బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం భారత్ వేట సాగించాల్సిందే. అందుబాటులో ఉన్న ఆప్షన్లలో శార్దూల్ ఠాకూర్ మాత్రమే  కనిపిస్తున్నాడు. 2021లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు  శార్దూల్ భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 


వచ్చే నెలలో నిర్ణయం.. 


ఉపఖండపు పిచ్ లతో పోలిస్తే ఇంగ్లాండ్ పిచ్ లు పూర్తి భిన్నంగా ఉండనున్న నేపథ్యంలో తుది జట్టు కసరత్తు భారత్ కు  సవాల్ తో కూడుకున్నదే.  అయితే దీనిపై శివసుందర్ దాస్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వచ్చే నెల తుది నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. శ్రేయాస్ అయ్యర్ గాయం,  హార్ధిక్ ఏమైనా మనసు మార్చుకోకపోతాడా..? లేకుంటే అతడిని ఎలాగైనా ఒప్పిచండంపై బీసీసీఐ దృష్టి పెట్టింది.  వచ్చే నెల చివర్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.