U19 Women's T20 WC: దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్- 19 టీ20 ప్రపంచకప్ ను భారత జూనియర్ అమ్మాయిలు గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘనవిజయం సాధించింది. భారత అమ్మాయిలు సాధించిన ఈ గొప్ప విజయానికి బీసీసీఐ వారిని సత్కరించనుంది. రేపు (బుధవారం) అహ్మదాబాద్ లో టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఆటగాళ్లను సత్కరించనున్నారు.
భారత్- న్యూజిలాండ్ ఆఖరి టీ20 మ్యాచ్ కు ముందు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జూనియర్ అమ్మాయిలను బీసీసీఐ సత్కరించనుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 'ఫిబ్రవరి 1న నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అండర్- 19 విజేతలను సత్కరించనున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది.' అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు. యువ క్రికెటర్లు దేశం గర్వించేలా చేశారు. వారి విజయాలను మేం గౌరవిస్తాం అని షా అన్నారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లకు, సహాయ సిబ్బందికి బీసీసీఐ రూ. 5కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.
ఇది ఆరంభం మాత్రమే: షెఫాలీ వర్మ
2023 అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత మహిళల జట్టు ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ చరిత్రాత్మక విజయం తర్వాత భారత కెప్టెన్ షెఫాలీ వర్మ తన తర్వాతి ప్రణాళికను వివరించింది.
అండర్- 19 టీ20 ప్రపంచకప్ లో భారత మహిళల జట్టుకు షెఫాలీ వర్మ కెప్టెన్ గా వ్యవహరించింది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను అందుకుంది. ఈ టోర్నీ మొత్తం షెఫాలీ ప్లేయర్ గా, కెప్టెన్ గా ఆకట్టుకుంది. జట్టును విజయపథంలో నడిపించింది. మ్యాచ్ గెలిచాక షెఫాలీ ఈ ప్రపంచకప్ విజయం గురించి, తన తర్వాతి ప్రణాళికల గురించి వివరించింది. 'ఇది ఆరంభం మాత్రమే. రెండు వారాల తర్వాత జరగనున్న సీనియర్ మహిళల టీ20 ప్రపంచకప్ లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలనుకుంటున్నాను' అని భారత కెప్టెన్ తెలిపింది.