Ind Vs Eng 2nd T20 Live Updates: ఇంగ్లాండ్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 2 వికెట్లతో విజయం సాధించింది. తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్, 4 ఫోర్లు, 5 సిక్సర్లు ) అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఛేదనను భారత్ 19.2 ఓవర్లలో 8వికెట్లకు 166 పరుగులు చేసి పూర్తి చేసింది. ముఖ్యంగా తిలక్ వర్మ ఒక వైపు వికెట్లు పడుతున్నా గోడలా నిలబడి ఇన్నింగ్స్ ను నడిపించాడు. చివరికంటా అజేయంగా క్రీజులో నిలిచి అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయం దిశగా నడిపించాడు. దీంతో సిరీస్ లో 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. బౌలర్లలో బ్రైడెన్ కార్స్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. సిరీస్ లో తర్వాత మ్యాచ్ ఈనెల 28న రాజకోట్ లో జరుగతుంది.
తిలక్ వర్మ తాండవం..
నిజానికి చెన్నై పిచ్ పై 165 పరుగుల స్కోరును చేజ్ చేయడం ఈజీ అనే చాలామంది భావించారు. గత మ్యాచ్ లో చాలా తేలికగా ఛేదనను పూర్తి చేసిన భారత్ ఈ మ్యాచ్ లోనూ అంతే ఈజీగా గెలిచేస్తుందని అనుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బౌలర్లు చాలా వేగంగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ తో వేసిన బంతులకు సమాధానం లేకుండా పోయింది. చాలామంది భారత బ్యాటర్లు అలాగే ఔటయ్యారు. తొలుత అభిషేక్ వర్మ (12)ను మార్క్ వుడ్ ఇలాగే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (5) ఫుల్ షాట్ ఆడి పెవిలియన్ కు చేరాడు. దీంతో 19 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లను భారత్ కోల్పోయింది. ఇక వన్ డౌన్ లో వచ్చిన తిలక్ తాండవం ఆడాడు. ఆరంభంలో దూకుడుగా ఆడి కళ్లు చెదిరే బౌండరీలు సాధించిన తిలక్.. ఆ తర్వాత వికెట్లు పడుతుండటంతో పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాడు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ (12), ధ్రువ్ జురెల్ (4), హార్దిక్ పాండ్యా (7) కూడా త్వరగానే ఔటవడంతో భారత్ కు ఓటమి తప్పదనిపించింది. ఈ దశలో లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 26) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 38 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టు కాస్త ఊపిరి తీసుకుంది. ఈక్రమంలో 38 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
ఓవైపు తిలక్ ఆచితూచి ఆడుతుంటే, సుందర్ కాస్త వేగంగా ఆడటంతో ఇంగ్లాండ్ ఉక్కిరి బిక్కిరి అయింది. ఇక సుందర్ ఔటయ్యాక, అక్షర్ పటేల్ (2) విఫలమైనా, చివరి వరుస బ్యాటర్లతో కలిసి జట్టును విజయ తీరాలకు తిలక్ చేర్చాడు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ (6), రవి బిష్ణోయ్ (9 నాటౌట్) కీలక దశలో బౌండరీలు సాధించి తిలక్ పై ఒత్తిడి పడకుండా చూశారు. ఆఖరికి ఓవర్టన్ బౌలింగ్ లో బౌండరీతో జట్టుకు తిలక్ ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఫిఫ్టీ చేసుకున్నప్పుడు సంబరాలు చేసుకోని తిలక్.. జట్టు విజయం సాధించాక స్టేడియం అంతా పరుగులు తీస్తూ అభిమానులకు జోష్ ను పంచాడు. అజేయంగా నిలిచిన తిలక్ వర్మకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆదుకున్న లోయర్ ఆర్డర్ బ్యాటర్లు..
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తన బలహీనతను మరోసారి ఇంగ్లాండ్ బయట పెట్టుకుంది. దూకుడుగా ఆడి బౌలర్లను ఒత్తిడిలోనికి నెట్టాలనుకున్న వాళ్ల ప్లాన్ తలకిందులయ్యింది. ముఖ్యంగా పుల్ షాట్లు, ఇన్ అండ్ ఔట్ షాట్లు ఆడుతూ బౌండరీల వద్ద క్యాచౌట్ అయ్యారు. తొలుత 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. ఈ దశలో మరోసారి హారీ బ్రూక్ తో కలిసి బట్లర్ సమయోచితంగా ఆడాడు. వీరిద్దరూ వికెట్లు పడినా కూడా ఎదురు దాడికి బౌండరీలు సాధించారు. దీంతో మూడో వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరూ ఔటయ్యాక తొలి టీ20 తర్వాత జట్టులోకి వచ్చిన బ్రైడెన్ కార్స్ మరోసారి తన ఆల్ రౌండ్ విలువను చాటి చెప్పాడు. తన స్ఫూర్తితోనే ఇంగ్లాండ్ 160 పరగుల మార్కును చేరుకోగలగింది. సగం జట్టు పెవిలియన్ కు చేరినా ఏమాత్రం వెరవకుండా సిక్సర్లతో చెలరేగి పోయాడు. ముఖ్యంగా అక్షర్ బౌలింగ్ లో ఫోర్, సిక్సర్ తో సత్తా చాటిన కార్స్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ బౌలింగ్ లో రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదడంతో అప్పటివరకు స్థబ్దుగా సాగిన స్కోరు బోర్డు ఉరకలెత్తింది. చివర్లో ఆదిల్ రషీద్ తో కలిసి మరోసారి కీలకమైన ఇన్నింగ్స్ ను జోఫ్రా ఆర్చర్ ఆడాడు. బంతికొక పరుగు జోడిస్తూ, చివర్లో విలువైన 20 పరుగులను ఈ జోడీ జత చేసింది. దీంతో ఇంగ్లాండ్ కాస్త సవాలు విసరగలిగే స్కోరును సాధించింది.