Chennai T20 Live Updates: భారత్ తో జరగుతున్న రెండో టీ20లో ఇంగ్లాండ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. శనివారం చెన్నైలో జరిగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (30 బంతుల్లో 45, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ తో మరోసారి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బ్రైడెన్ కార్స్ (17 బంతుల్లో 31, 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండో వికెట్లతో సత్తా చాటారు. ఈ మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు అంతగా రాణించ లేక పోయారు. 11.1 ఓవర్లకే సగం వికెట్లను కోల్పోయింది. మరోసారి లోయర్ ఆర్డర్ రాణించడంతో కాస్త సవాలు విసరగలిగే స్కోరును సాధించింది. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్ సానుకూల ఫలితం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అనుకూలిస్తుందన్న అంచనాతో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. 


బలహీనతను బయట పెట్టుకున్న ఇంగ్లాండ్..
స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తన బలహీనతను మరోసారి ఇంగ్లాండ్ బయట పెట్టుకుంది. దూకుడుగా ఆడి బౌలర్లను ఒత్తిడిలోనికి నెట్టాలనుకున్న వాళ్ల ప్లాన్ తలకిందులయ్యింది. ముఖ్యంగా పుల్ షాట్లు, ఇన్ అండ్ ఔట్ షాట్లు ఆడుతూ బౌండరీల వద్ద క్యాచౌట్ అయ్యారు. ఇక తొలి టీ20 మాదిరిగానే అర్షీదీప్ సింగ్ మరోసారి భారత్ కు శుభారంభం అందించాడు. ఫోర్ కొట్టి జోరు మీదున్న ఫిల్ సాల్ట్ (4)ను మరోసారి బలిగొన్నాడు. అర్షదీప్ వేసిన బౌన్సర్ ను ఆడే క్రమంలో బౌండరీ వద్ద వాషింగ్టన్ సుందర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కాస్త ఓపికగా ఆడిన బెన్ డకెట్ ను సుందర్ పెవిలియన్ కు పంపాడు. స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించిన డకెట్, జురెల్ కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది.






ఈ దశలో మరోసారి హారీ బ్రూక్ (13)తో కలిసి బట్లర్ సమయోచితంగా ఆడాడు. వీరిద్దరూ వికెట్లు పడినా కూడా ఎదురు దాడికి బౌండరీలు సాధించారు. దీంతో మూడో వికెట్ కు 23 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఈ దశలో బంతిని అందుకున్న వరుణ్ చక్రవర్తి.. బ్రూక్ మరోసారి బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కాస్త నెమ్మదిగా ఆడిన బట్లర్.. అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. వికెట్లపై వచ్చిన బంతిని ఫుల్ షాట్ ఆడి డీప్ మిడ్ వికెట్ వద్ద ఉన్న తిలక్ వర్మ చేతికి చిక్కాడు.  లియామ్ లివింగ్ స్టన్ (13) మరోసారి విఫలం కాగా, కొత్తగా జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (22) కూడా ఔటవడంతో ఇంగ్లాండ్ పీకల్లతు కష్టాల్లో చిక్కుకుంది. 


ఆదుకున్న కార్స్..
తొలి టీ20 తర్వాత జట్టులోకి వచ్చిన బ్రైడెన్ కార్స్ మరోసారి తన ఆల్ రౌండ్ విలువను చాటి చెప్పాడు. తన స్ఫూర్తితోనే ఇంగ్లాండ్ 165 పరగుల మార్కును చేరుకోగలగింది. సగం జట్టు పెవిలియన్ కు చేరినా ఏమాత్రం వెరవకుండా సిక్సర్లతో చెలరేగి పోయాడు. ముఖ్యంగా అక్షర్ బౌలింగ్ లో ఫోర్, సిక్సర్ తో సత్తా చాటిన కార్స్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ బౌలింగ్ లో రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదడంతో అప్పటివరకు స్థబ్దుగా సాగిన స్కోరు బోర్డు ఉరకలెత్తింది. అయితే అదే ఓవర్లో ను ఓవర్టన్(5) ను వరుణ్ బౌల్డ్ చేయగా, తర్వాతి ఓవర్లో సమన్వయ లోపంతో కార్స్ రనౌటయ్యాడు. దీంతో కనీసం ఇంగ్లాండ్ 150 పరుగులైనా దాటుతుందా అనిపించింది. 
ఈ దశలో ఆదిల్ రషీద్ (10)తో కలిసి మరోసారి కీలకమైన ఇన్నింగ్స్ ను జోఫ్రా ఆర్చర్ (12 నాటౌట్) ఆడాడు. బంతికొక పరుగు జోడిస్తూ, చివర్లో విలువైన 20 పరుగులను ఈ జోడీ జత చేసింది. దీంతో ఇంగ్లాండ్ కాస్త సవాలు విసరగలిగే స్కోరును సాధించింది. బౌలర్లలో హార్దిక్ పాండ్య (1/6) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అర్షదీప్, వాషింగ్టన్, అభిషేక్ శర్మలకు తలో వికెట్ లభించింది. ఐదు టీ20ల సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. 


Read Also: Noman Ali: పాక్ స్పిన్నర్ నోమన్ అలీ అరుదైన ఘనత, టెస్టు క్రికెట్‌లో తొలిసారిగా..